రిపోర్టర్ పై దాడిని ఖండించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర
కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
బాధిత రిపోర్టర్ ను పరామర్శించిన గండ్ర
భూపాలపల్లి టౌన్, ఆగస్టు 17 (విజయక్రాంతి) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన ఆర్ బి న్యూస్ రిపోర్టర్ పుల్ల రవీందర్ ( రవితేజ ) పై జరిగిన దాడిని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు జిల్లా ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొండుతున్న రవీందర్ ను గండ్ర పరామర్శించి దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గండ్ర మాట్లాడుతూ భూ వివాదానికి సంబంధించిన విషయాన్ని మీడియా దృష్టికి తీసుకెళ్లినందుకే రవీందర్ పై దాడి చేసినట్లు ఆరోపించారు.
రాత్రి పూట ఇంట్లోకి చొరబడి భయబ్రాంతులకు గురి చేసి కులం పేరుతో దుషిస్తూ దాడి చేయడంతో పాటు ఇంట్లో వస్తువులు ధ్వంసం చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. వెంటనే జిల్లా ఎస్పీ ఘటనపై స్పందించి దర్యాప్తు జరిపి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకున్న తరుణంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం బాధాకరం అన్నారు. పోలీస్ అధికారులు రాజకీయ ఒత్తిడిలకు తలొగ్గకుండా సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా గండ్ర డిమాండ్ చేశారు.






