4 July, 2026 | 1:51 AM

ప్రైవేట్ పాఠశాలలపై దాడులు సహించం

04-07-2026 01:07 AM

- ట్రెస్మా హెచ్చరిక

- మాస్టర్ మైండ్ స్కూల్ ఘటనపై పోలీసులకు, డీజీపీకి ఫిర్యాదు

జగదేవపూర్, జూలై 3: జగదేవపూర్ మండల కేంద్రంలోని మాస్టర్ మైండ్ పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి యాజమాన్యంతో దురుసుగా ప్రవర్తించడంతో పాటు డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరించారని పాఠశాల చైర్మన్ రాఘవేంద్ర రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ట్రెస్మా రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ మాట్లాడుతూ, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారిని అమర్యాదగా మాట్లాడటం, ప్రైవేట్ పాఠశాలలపై దాడులకు పాల్పడటం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విద్యార్థి సంఘాలు విద్యా వ్యవస్థలో మార్పుల కోసం పోరాడాలే తప్ప పాఠశాలలను లక్ష్యంగా చేసుకోవడం సరైన విధానం కాదన్నారు.

హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పుస్తకాలను ఎంఆర్పీ కంటే తక్కువ ధరలకు అందిస్తున్నామని, అనుమతి లేకుండా పాఠశాలల్లోకి ప్రవేశించి డబ్బులు డిమాండ్ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీకి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సమావేశంలో ట్రెస్మా రాష్ట్ర కార్యదర్శి రమేష్ రావు, గజ్వేల్ ట్రెస్మా అధ్యక్షుడు మనోజ్ కుమార్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ఇన్నారెడ్డి, జగదేవపూర్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి రామస్వామి, నాయకులు సోమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.