10 March, 2026 | 2:52 AM

నల్లబ్యాడ్జీలతో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన

10-03-2026 01:22 AM

లింగంపేట్, మార్చి 9 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న మూడు దశల నిరసన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం కామారెడ్డి జిల్లాలోని తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల విద్యా వనరుల కేంద్రాలు (MRC), కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (KGBV), పాఠశాలలు, భవిత కేంద్రాల ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి సిబ్బంది నిరసన కార్యక్రమాలు నిర్వహించిన్నట్లు కామారెడ్డి జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ  తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 18సంవత్సరాలుగా విద్యా వ్యవస్థ అభివృద్ధికి కీలకంగా పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇప్పటికీ ఉద్యోగ భద్రత లేకపోవడం తీవ్ర అన్యాయమని పేర్కొన్నారు.

అలాగే గతంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మె సమయంలో ప్రభుత్వం ఇచ్చిన నాన్ ఫైనాన్షియల్, ఫైనాన్షియల్ హామీలను తక్షణమే అమలు చేయాలని కోరారు. సమ్మె కాలానికి సంబంధించిన 29 రోజుల వేతనాన్ని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, వారికి న్యాయం చేయాలని టీఎస్ యుటిఎఫ్ నాయకులు కోరారు.

టీఎస్ యుటిఎఫ్ ప్రకటించిన మూడు దశల నిరసన కార్యక్రమాలలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు గంగాధర్, స్వప్న, రాజు, విజయ్, రాజు, సంగమేశ్వర్, ఆంజనేయులు పాల్గొన్నారు.