6 July, 2026 | 8:13 PM

జూలై 12న కామ్రేడ్ డీవీ–టీఎన్ సంస్మరణ సభ

06-07-2026 07:35 PM

ప్రజలు, ప్రజాతంత్రవాదులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి

గ్రామీణ పేదల సంఘం జిల్లా కార్యదర్శి కొనకంచి వీరభద్రయ్య పిలుపు

చివ్వెంల,(విజయక్రాంతి): భారత కమ్యూనిస్టు విప్లవ ఉద్యమ ప్రముఖులు, భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం (యూసీసీఆర్‌ఐ) వ్యవస్థాపక నాయకులు కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వరరావు (డీవీ), కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి (టీఎన్) సంస్మరణ సభను జూలై 12వ తేదీన చివ్వెంల మండలం చందుపట్ల శివారులోని అక్కలదేవిగూడెం గ్రామంలో నిర్వహిస్తున్నట్లు గ్రామీణ పేదల సంఘం జిల్లా కార్యదర్శి కొనకంచి వీరభద్రయ్య తెలిపారు.

సోమవారం చందుపట్ల గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వరరావు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి సిద్ధాంతకర్తగా విశిష్ట సేవలు అందించారని, ఆయన చూపిన విప్లవ మార్గం నేటికీ ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి భారత ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై లోతైన విశ్లేషణలు చేస్తూ, పార్లమెంట్‌, అసెంబ్లీలలో ప్రజా సమస్యలను నిర్భయంగా ప్రస్తావించిన గొప్ప విప్లవ నాయకుడని కొనియాడారు. వారి ఆశయాలు, ప్రజల పట్ల అంకితభావం, విప్లవ సిద్ధాంతాలను స్మరించుకుంటూ ఈ సంస్మరణ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూలై 12న జరిగే ఈ సభకు రైతులు, కార్మికులు, యువత, విద్యార్థులు, ప్రజాసంఘాల నాయకులు, ప్రజాతంత్రవాదులు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని వీరభద్రయ్య పిలుపునిచ్చారు.