6 July, 2026 | 8:33 PM

రోడ్డు ప్రమాదంలో గాయపడి యువకుడు మృతి

06-07-2026 07:59 PM

కల్లూరు,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతి చెందిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. పోచారం గ్రామానికి చెందిన గొర్రెపాటి జలంధర్ (30) సోమవారం మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జలంధర్ కల్లూరులోని ఓ స్వీట్ షాప్‌లో పనిచేస్తూ పది రోజుల క్రితం పని ముగించుకుని బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా చెన్నూరు సమీపంలో అకస్మాత్తుగా రోడ్డుమీదకు వచ్చిన గేదెను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్యతో పాటు 10 ఏళ్ల లోపు వయస్సు గల ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.కుటుంబ పోషణ బాధ్యతలన్నీ జలంధర్‌పైనే ఉండగా,అతని మరణంతో ఆ కుటుంబం ఆర్థికంగా కుదేలైంది. ప్రస్తుతం భార్య కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నప్పటికీ, సంపాదించే వ్యక్తిని కోల్పోవడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని స్థానికులు, బంధువులు కోరుతున్నారు.