04-02-2026 01:59:58 AM
ఏటా సింగరేణి నికర లాభమే లక్ష్యం
సంస్థ కార్యకలాపాలపై డిప్యూటీ సీఎం కసరత్తు
రూ. 2 లక్షల కోట్ల టర్నోవర్ దిశగా పరుగులు పెట్టించాలి
రాష్ట్రానికి ఆర్థికంగా అండదండగా నిలుస్తున్న సంస్థ
సమర్థ వంతమైన సీఎండీ కోసం ఎదురుచూపు
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి) : సుమారు 130 ఏండ్లకుపైబడిన చరిత్ర.. తెలంగాణకు కొంగు బంగారంలా నిలుస్తున్న సింగరేణి సంస్థ దేశ చరిత్రలోనే అత్యంత పురాతనమైన బొగ్గు సంస్థ. అలాంటి సంస్థపై వరుసగా ఆరోపణలు, విమర్శలు వచ్చిపడుతున్నాయి. సంవత్సరంలో సగానికిపైగా సమ్మెలు, ధర్నాలు, హర్తాళ్‌లతో కునారిల్లిన సింగరేణి నష్టాలతో మూసివేయాల్సిన దుస్థితి నుంచి.. ఏటా రూ. 6,300 కోట్ల నికర లాభాలను ఆర్జించే స్థాయికి చేరింది.
దీని వెనుక కార్మికుల సంఘటిత శక్తి, సమర్థులైన అధికారుల ప్రణాళికలు, ప్రజా సంక్షేమమే పరమావధిగా ముందుకు సాగిన ప్రజాప్రతినిధుల కృషి ఎంతో ఉంది. తాజాగా నైనీ బ్లాక్ టెండర్ వివాదం నేపథ్యంలో సింగరేణి ఏ దిశగా పయనిస్తుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. తిరిగి మరోసారి గత కాలంనాటి గడ్డు పరిస్థితులు సింగరేణిలో కనపడుతాయా అనే అనుమానాలూ వక్తమవుతున్నాయి. అయితే అలాంటి పరిస్థితులు రానివ్వనని గట్టిగా చెబుతూ.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణి బలోపేతంపై దృష్టి సారించారు.
సమర్థుడైన అధికారి అవసరం
అయితే ఇలాంటి ఆర్థిక పరిపుష్టితో ఉన్న సింగరేణి సంస్థ వరుసగా బహిర్గతమవుతున్న వివాదాలు, కుంభకోణాల విమర్శలతో తల్లడిల్లుతోంది. బంగారు గుడ్లు పెట్టే బాతులాంటి సింగరేణిలో సిండికేట్లు, స్వార్థ ప్రయోజనాల కోసం బలిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సింగరేణిని అభివృద్ధి, ఆర్థికంగా మరింతగా పరుగులు పెట్టించే శక్తిసామర్థ్యాలున్న అధికారి కోసం ఎదురు చూస్తోంది.
పూర్తిస్థాయి బాధ్యతలతో, నిజాయితీ కలిగిన సీఎండీ (చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్)ను ఇక్కడ నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తాత్కాలిక నియామకాలతో సరిపెట్టడం సరైంది కాదు. సింగరేణి కేవలం బొగ్గు రంగంలోనే కాదు.. ఇతర ఖనిజ తవ్వకాల రంగంలోకూడా దేశ విదేశాల్లో విస్తరించే సామర్థ్యం ఉంది. దానిని ఒడిసిపట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రూ. 30 వేల కోట్లకుపైగా టర్నోవర్‌తో..
ప్రస్తుతం రూ. 30 వేల కోట్లకుపైగా టర్నోవర్‌తో సింగరేణి ముందుకు సాగుతోంది. అయితే వాస్తవానికి సింగరేణికి ఉన్న శక్తిసామర్థ్యాలన పరిశీలిస్తే.. దీనికి రూ. 2 లక్షల కోట్ల టర్నోవర్ వరకు తీసుకెళ్లే సామర్థ్యం ఉందని సీనియర్ అధికారులు, నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఏటా కనీసం రూ.10 వేల కోట్ల నికర లాభాలను ఇది ఒడిసిపట్టగలదని, ఆ దిశగా సాగే సామర్థ్యం ఉందని కూడా వారంటున్నారు. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది.
దేశ విదేశాల్లో సింగరేణికి అనుకూలంగా ఉండే అవకాశాలు, వాటిని ఎలా ఒడిసిపట్టుకోవాలి.. ఎవరి ప్రమేయం లేకుండా స్వతంత్రంగా ముందుకు సాగేలా ప్రణాళికలు లాంటివాటిపై డిప్యూటీ సీఎం దృష్టి సారించినట్టు సమాచారం. అంచెలంచెలుగా ఆ దిశగా సింగరేణి సాగితే.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే సామర్థ్యం సింగరేణికి ఉంది. అయితే ఇటీవల జరుగుతున్న పరిణామాలు సింగరేణి బ్రాండ్ ఇమేజీని దెబ్బతీసేలా ఉన్నాయి. దీనిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్మికులతో పాటు ప్రతి ఒక్కరిపై ఉంది.
రాష్ట్రానికే మణిహారం..
తెలంగాణ రాష్ట్రానికి మణిహారంగా పేర్కొన దగ్గ సింగరేణి సిరుల వల్లి. కార్యదక్షత, నిజాయితీ, పారదర్శకత, నిర్వహణ సామర్థ్యాల పరంగా సింగరేణి అత్యుత్తమ సంస్థల్లో ఒకటి. ఈ సంస్థలో తెలంగాణ ప్రభుత్వానికి 51 శాతం, కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉంది. 42000 మంది ఉద్యోగులు, రూ. 30,000 కోట్ల టర్నోవర్‌తో.. రూ. 6300 కోట్ల నికర విలువతో ఈ సంస్థ విరా జిల్లుతోంది. ఆర్థిక ఒడిదుడుకుల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వమే బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలకు 10 శాతం వడ్డీని చెల్లిస్తుంటే.. సింగరేణికి మాత్రం బ్యాంకులు 6.9 శాతం వడ్డీకే రుణాలిస్తుండటం.. సింగరేణి సంస్థ ఆర్థిక దృఢత్వానికి నిదర్శనంగా చెప్పవచ్చు.
కేంద్రం నుంచి మద్దతు
సంప్రదాయబద్ధంగా బొగ్గు తవ్వకాలతోపాటు.. గడిచిన కొద్ది సంవత్సరాలుగా వినూత్నంగా సింగరేణి తన వ్యాపార దృక్పథాన్ని మార్చుకుని పయనిస్తోంది. థర్మల్ విద్యుత్తు, సౌర శక్తి, పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్తు, క్రిటికల్ మినరల్స్ ఎక్స్‌ప్లోరేషన్ లాంటి కొత్త కొత్త రంగాల్లోకి అడుగుపెట్టడం ద్వారా ఆర్థిక పరిపుష్టికి బాటలు పర్చుకుంటోంది. అయితే ఈ నేపథ్యంలో మరింత బలంగా ముందుకు సాగాలంటే.. కేంద్రం మద్దతు కూడా కావాలి. అవసరమైన చోట కేంద్రం మద్దత్తు తీసుకోవాలి.
రాజకీయ జోక్యం, సిండికేట్ల ప్రభావం లేకుండా సింగరేణి స్వతంత్రంగా పనిచేస్తే రూ. 2 లక్షల కోట్ల టర్నోవర్ దిశగా సాగడం పెద్ద కష్టమేమీ కాదని ఆ రంగానికి చెందిన నిపుణులు, మాజీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. సింగరేణికి ఉన్న శక్తిసామర్థ్యాలకు అనుగుణంగానే ప్రణాళికలు రచించి.. దేశ విదేశాల్లో ఉన్న అవకాశాలను ఒడిసిపట్టుకోవడం ద్వారా సంస్థను మరింతగా విస్తరించి, ఎక్కువ మందికి ఉపాధి కల్పించి, మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ.. ‘నల్ల బంగారం’ ద్వారా బంగారు తెలంగాణ కలను సాకారం చేసే దిశగా పయనించవచ్చనేది స్పష్టం.