15-01-2026 12:00:00 AM
కాంగ్రెస్ నాయకులు అమర్నాథ్ రెడ్డి
మొయినాబాద్, జనవరి 14 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎంకేపల్లి మాజీ సర్పంచ్ అమర్నాథ్ రెడ్డి అన్నారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని ఎంకేపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులంతా ఏకతాటిగా పాల్గొని, పార్టీ అధిష్టానం మున్సిపల్ లో ఎవరికి టికెట్ ఇచ్చి బీఫారం అందజేస్తే వారికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని వెల్లడించారు.
దీనిపై అమర్నాథ్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ పాలనలోనే అమలవుతున్నాయని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు దశలవారీగా బిల్లులు చెల్లిస్తూ ఇళ్ల నిర్మాణం సాగుతున్నదని పేర్కొన్నారు. ఈ విధంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న లబ్ధిదారులను ఆయన అభినందించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి తెలంగాణ రాష్ట్రంలో పార్టీని ముందంజలో నిలపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎనికేపల్లి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామ అధ్యక్షులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.