15-01-2026 12:00:31 AM
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం
ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీ
తండ్రి మృతి, చికిత్స పొందుతున్న కొడుకు
ఎల్బీనగర్, జనవరి 14 : పండుగ పూట హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. పండుగకు ద్విచక్ర వాహనంపై సొంత ఊరికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలతో కొడుకు దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్ పేట సమీపంలో నేషనల్ హైవే 65 సర్వీస్ రోడ్డుపై చోటు చేసుకుంది. సీఐ నాగరాజ్‌గౌడ్ తెలిపిన వివరాలు.. యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన గంజి అశోక్ (55) హయత్ నగర్ పరిధిలోని మునగనూరులో నివాసం ఉంటూ చేనేత కార్మికుడిగా పనిచేస్తున్నాడు.
కాగా, సంక్రాంతి పండుగ సందర్భంగా అశోక్ తన కొడుకు ఉమాకాంత్ తో కలిసి బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో స్వగ్రామానికి బైక్ పై వెళ్తున్నారు. ఉమాకాంత్ బైక్ నడుపుతుండగా తండ్రి అశోక్ వెనుక కూర్చున్నాడు. అయితే, మునగనూర్ నుంచి జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు మీదుగా పెద్ద అంబర్ పేట వైపు వెళ్తున్నారు. సీతారాంపురం కమాన్ సమీపంలోకి చేరుకోగానే, ఎదురుగా వస్తున్న బైక్ (TG09AKT/R9363) వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అశోక్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఉమాకాంత్ తీవ్రంగా గాయపడి, దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగరాజ్ గౌడ్ తెలిపారు.