నారాయణపురంలో తీవ్ర ఉద్రిక్తత
కాంగ్రెస్ - బీజేపీ పోటాపోటీ నిరసనలు
మోడీ రాజీనామా చేయాలన్న కాంగ్రెస్ నాయకులు
రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బిజెపి నాయకులు
సంస్థాన్ నారాయణపూర్ ,జూలై 23(విజయ క్రాంతి): సంస్థాన్ నారాయణపురం(Samsthan Narayanpur) మండలకేంద్రంలో కాంగ్రెస్ - బీజేపీ పార్టీల పోటాపోటీ నిరసనలతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నీట్ పరీక్షా పత్రం లీకేజీ(NEET exam paper leak) వ్యవహారంపై విద్యార్థులకు అండగా నిలిచిన రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నాయకుల పట్ల కేంద్రం వ్యవహరించిన తీరును నిరసిస్తూ మండలకేంద్రంలోని చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టి నినాదాలు చేశారు. మరోవైపు బీజేపీ నాయకులు కూడా చౌరస్తకు చేరుకొని కాంగ్రెస్ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కాంగ్రెస్ నాయకుల దిష్టిబొమ్మను దగ్దం చేయడానికి ప్రయత్నించారు.దీంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.ఇరుపార్టీల నాయకుల నినాదాలతో ఆప్రాంతం హోరెత్తిపోయింది. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ దేశంలో విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆటలాడుతోందని శాంతియుత వాతావరణంలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీ ఛార్జీ చేయడం దుర్మార్గమని అన్నారు.దీనిపై విద్యార్థులకు అండగా నిలబడ్డ రాహుల్ గాంధీని కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడం హేయమైన చర్య అని అన్నారు.
బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రపంచ దేశాల సరసన భారతదేశాన్ని నిలబెట్టిన నరేంద్ర మోదీ ప్రతిష్టను దెబ్బతీయడమే కాంగ్రెస్ నాయకుల లక్ష్యమని అన్నారు.నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకొని విద్యార్థులు తమ విద్యాసంవత్సరం నష్ట పోకుండా వారికి వెంటనే పరీక్షలు నిర్వహించారని అన్నారు.విద్యార్థులపై కాంగ్రెస్ కపట ప్రేమను దేశమంతా గమనిస్తోందని అన్నారు.మరోవైపు నిరసనలతో బస్సులు అరగంట పాటు ఆపివేయడంతో కొందరు మహిళలు అసహనం వ్యక్తం చేశారు. సిఐ సతీష్ రెడ్డి,ఎస్సై పాండు ఇరుపార్టీల నాయకులతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు.






