17-02-2026 12:00:00 AM
జానయ్య యాదవ్
సూర్యాపేట, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి) : కాంగ్రెస్, బిఆర్‌ఎస్ లు రెండు బీసీలను అణగదుకుతున్నాయని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ వట్టె జానయ్య యాదవ్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేటలోనూ కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలు కలిసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను రాజకీయంగా అణచివేస్తున్నాయని ఆయన ఆరోపించారు. సంవత్సరాల తరబడి జెండాలు మోసిన కార్యకర్తలకు సమయం వచ్చినప్పుడు పదవులు ఇవ్వకుండా, అగ్రవర్ణ కాంట్రాక్టర్లకు, ప్రభావశీల వర్గాలకు పదవులు కట్టబెడుతున్నారని విమర్శించారు.
మున్సిపాలిటీలో గెలిచిన బీసీ ప్రజాప్రతినిధులకు తగిన గౌరవం, అవకాశాలు ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నట్లు నటిస్తూ, కీలక సందర్భాల్లో ఒకటై బీసీల ఎదుగుదలను అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. పదేళ్లపాటు జరిగిన దోపిడీపై ప్రశ్నించని వారు, ఇప్పుడు కూడా రాజకీయ లాభాల కోసం కలిసి పనిచేస్తున్నారన్నారు.
తెలంగాణ రాజ్యాధికార పార్టీ 95 శాతం ప్రజల వర్గాలకు రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా పని చేస్తోందని స్పష్టం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులు ఇప్పటికైనా ఆలోచించి తమ రాజకీయ భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మామి డి అంజయ్య, సూర్యాపేట జిల్లా మహిళా అధ్యక్షురాలు కొన్నె మంజుల గౌడ్,కార్యదర్శి నారాయణ దాసు కవిత, పట్టణ కార్యదర్శి ఏశబోయిన మల్లేష్, ఆత్మకూరు మండల అధ్యక్షుడు బొల్లె సైదులు ,పెన్పహాడ్ మండల అధ్యక్షుడు ఆవుల అంజయ్య, మాజీ మార్కెట్ డైరెక్టర్ మురళి తదితరులు పాల్గొన్నారు.