భువనగిరిపై కాంగ్రెస్ జెండా
యాదాద్రి భువనగిరి, జూన్ 4 (విజయక్రాంతి): భువనగిరి లోక్‌సభ నియోజ కవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘన విజయం సాధించారు. 2,22,170 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్‌పై భారీ మెజార్టీతో విజయం సాధించారు. కిరణ్‌కుమార్ రెడ్డికి 6,29,143 ఓట్లు రాగా బూర నర్సయ్య గౌడ్‌కు 4,06,973 ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్ 2,55,848 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. భువనగిరి పరిధిలో కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టు ఉన్నప్పటికీ తొలుత బీజేపీ అభ్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురైంది.
మాజీ ఎంపీగా ఆయనకు ఉన్న పరిచయాలు, అందించిన సేవలు, బలహీనవర్గాల మద్దతుతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభావం కారణంగా ఆయన చివరి వరకు పోరాడి రెండో స్థానం దక్కించుకున్నారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరుచోట్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉండటం కిరణ్‌కుమార్ రెడ్డికి కలిసిసొచ్చింది. దీనికి తోడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కోఆర్డినేటర్‌గా బాధ్యతలు అప్పగించడంతో భారీ మెజార్టీ రావడానికి కలిసి వచ్చింది.
ధీమాతో ఉన్నప్పటికీ..
బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ముందు నుంచి గెలుపుపై ధీమాతో ఉన్నారు. పార్టీ కంటే తన సొంత ఇమేజ్, సామాజికవర్గ సమీకరణ తన గెలుపునకు ఉపకరిస్తుందని భావించారు. అదే విధంగా పోలింగ్ రోజున బీఆర్‌ఎస్ క్రాస్ ఓటింగ్ కలిసివస్తుందనే ఆశలు పెట్టుకున్నారు. కానీ పార్లమెంట్ పరిధిలో బీజేపీ బలం అంతంతగానే ఉండడంతో రెండో స్థానానికి పరిమితమయ్యారు.






