17 July, 2026 | 9:10 AM

చెయ్యి తిరగలేదా..?

05-06-2024 01:38 AM

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గురి తప్పిందా?  

14 సీట్లు టార్గెట్‌గా బరిలోకి దిగిన హస్తం 

ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి 

పార్టీ అగ్రనేతలు ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీలు ప్రచారం

మంత్రులు,  సీనియర్లకు నియోజక వర్గాల  ఇన్‌చార్జ్ బాధ్యతలు 

ఆఖరికి 8 స్థానాలకే పరిమితం.. మొదలైన పోస్ట్‌మార్టమ్

హైదరాబాద్, జూన్4 (విజయక్రాంతి):  పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం పార్టీ లక్ష్యం గురి తప్పింది. 14 స్థానాల్లో విజయం సాధిస్తామని అంచనా మారిపోయింది.  పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ వంద రోజుల పాలనకు రెఫరెండమని కూడా సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీకి సవాల్ విసిరారు. అయితే ఇప్పుడు హస్తం పార్టీ  ఎనిమిది స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అనుకున్న  గురి ఎక్కడ తప్పిందనే దాని పై  గాంధీభవన్ వర్గాల్లో చర్చ మొదలైంది. 

ఆరు నెలల క్రితం రాష్ట్రంలో జరి గిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వం ఏర్పా టు చేసింది. కాంగ్రెస్ పార్టీకి 64, మిత్రపక్షమైన సీపీఐతో కలిసి మొత్తం 65 స్థానాల్లో విజయం సాధించింది. అయి తే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ అవలీలంగా 12 పార్లమెంట్  నియోజక వర్గాల్లో విజయం సాధించే అవకాశం ఉండేది. మరింత కష్టపడితే మరో రెండు లేదా మూడు నియోజక వర్గాల్లో గెలుపొందడానికి అవకాశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బావించాయి.

అందుకు అనుగుణంగానే పార్టీ అగ్రనేతల ప్రచారం నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విస్తృతంగా ప్రచారం చేపట్టారు.  ప్రతి పార్లమెంట్ నియోజక వర్గంలో సభలు, సమావేశాలు, రోడ్డు షోలతో మూడే సభలకు పార్టీ అభ్యర్థుల విజయం కోసం గట్టి ప్రయత్నాలు చేశారు.  అంతే కాకుండా ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్  అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.   మంత్రులు, పార్టీ సీనియర్లకు ప్రతి పార్లమెంట్  నియోజక వర్గానికి  ఒకరిని ఇన్‌చార్జ్‌లుగా నియమించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

నల్లగొండ  పార్లమెంట్‌కు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భువనగిరికి ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, ఖమ్మం నియోజక వర్గానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి,  నాగర్‌కర్నూల్‌కు మంత్రి జూపల్లి కృష్ణారావు, పెద్దపల్లికి మంత్రి శ్రీధర్‌బాబు, జహీరాబాద్‌కు మంత్రి దామోదర రాజనరసిం హలు ఇన్‌చార్జ్‌లు  ఉండి పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. ఇక మంత్రి సీతక్క అదిలాబాద్, కొండ సురేఖ మెదక్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి సికింద్రాబాద్ ఇన్‌చార్జ్‌లుగా వ్యవహారించా రు. అయినప్పటికి అనుకున్న లక్ష్యానికి కాంగ్రెస్ పార్టీ చేరుకోలేక పోయిందని పార్టీ వర్గాలు చెబుతున్నారు. 

దక్షిణ తెలంగాణలో పదిలం..  

కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి దక్షిణ తెలంగాణలో మంచి పట్టు ఉన్నది. అది అసెంబ్లీ ఎన్నికలో రుజువైంది. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన మల్కాజ్‌గిరి, భువనగిరి, నల్లగొండ లోక్‌సభ నియోజక వర్గాలు దక్షిణ తెలంగాణ పరిధిలోనే ఉన్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో  గెలిచిన 8 సీట్లలో నాగర్‌కర్నూల్, భువనగిరి, నల్లగొండ, ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మిగతా నాలుగు పెద్దపల్లి, జహీరాబాద్, వరంగల్, మహబూబాబాద్ నియోజక వర్గాలు  ఉత్తర తెలంగాణ పరిధిలో ఉన్నాయి.