17 July, 2026 | 9:42 AM

చరిత్ర సృష్టించిన రఘువీర్‌రెడ్డి

05-06-2024 01:33 AM

నల్లగొండలో 5.51 లక్షల ఓట్ల రికార్డు మెజార్టీ

హుజూర్‌నగర్‌లో 1,11,423.. కోదాడలో 1,02,762 ఓట్ల భారీ మెజార్టీ

మంత్రి ఉత్తమ్ నియోజకవర్గంలో భారీ ఆధిక్యం

పోటీనే ఇవ్వని ప్రధాన పార్టీల ప్రత్యర్థులు

సూర్యాపేట, జూన్ 4 (విజయక్రాంతి): నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్‌రెడ్డి చరిత్ర సృష్టించారు. తెలంగాణ పార్లమెంట్ చరిత్రలోనే అత్యధిక మెజార్టీ సాధించి రికార్డు నెలకొల్పారు. మంగళవారం ఫలితాల్లో ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో భారీ మెజార్టీతో విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై ౫,౫౧,౧౬౮ ఓట్ల మెజార్టీ సాధించారు.

నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి విజయం వెనక మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాత్ర ఎక్కువగా కనబడుతున్నది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్‌నగర్ నియోజకవర్గంలోనే దాదాపు ౧,౧౧,౪౨౩ ఓట్ల ఆధిక్యం రావడం, ఉత్తమ్ సతీమణి  పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడలో ౧,౦౨,౭౬౨ ఓట్ల మెజార్టీ రావడం గమనార్హం. సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థికి 2,85,681 ఓట్ల మెజార్టీ వచ్చింది. నల్లగొండ పార్లమెంట్ పరిధిలో నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జున్‌సాగర్, సూర్యాపేట జిల్లాలోని కోదాడ, సూర్యాపేట, హుజుర్‌నగర్ అసెంబ్లీ సెగ్మెట్లు ఉన్నాయి.

ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తుండగా, సూర్యాపేటలో మాత్రమే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు. కాగా, ఏడు సెగ్మెంట్లలోనూ కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజార్టీ లభించింది.  సూర్యాపేట జిల్లాకు చెందిన స్థానిక ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి శానంపుడి సైదిరెడ్డి జిల్లాలో మూడో స్థానానికి పరిమితం అవడం గమనార్హం. ఆయనకు నల్లగొండ, నాగార్జున్‌సాగర్, దేవరకొండ అసెంబ్లీ సెగ్మెంట్లలో కాస్త ఎక్కువ ఓట్లు పోలైనాయి. సూర్యాపేట జిల్లాలో బీఆర్‌ఎస్ అభ్యర్థి రెండో స్థానం దక్కించుకోగా, నల్లగొండ ఓట్లతో కలిపి మూడో స్థానానికి పడిపోయాడు.

సూర్యాపేట జిల్లాలోని హుజుర్‌నగర్‌లో మంత్రి ఉత్తమ్, కోదాడలో ఉత్తమ్ పద్మావతి ఎమ్మెల్యేలుగా ఉండటంతోపాటు సూర్యాపేటలోను మంత్రికి పట్టు ఉండటంతో కాంగ్రెస్‌కు పూర్తి ఆధిక్యం లభించింది. ఈ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే 52 శాతం మెజార్టీ లభించగా, మిగిలిన నాలుగు నియోజకవర్గాలలో 48 శాతం మెజార్టీ దక్కింది. ముఖ్యంగా హుజుర్‌నగర్, కోదాడ నియోజకవర్గాలలో 2,14,185 మెజార్టీ రావడంతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రఘువీర్ గెలుపునకు భాగా కృషి చేశారని తెలుస్తోంది. 

తొలి సారి పోటీ.. రికార్డు మెజార్టీ

కాంగ్రెస్ నుంచి నల్లగొండ ఎంపీగా గెలుపొందిన కుందూరు రఘువీర్‌రెడ్డి నల్లగొండ జిల్లా అనుముల గ్రామానికి చెందిన మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి పెద్ద కుమారుడు. ఈయన 1980లో జన్మించారు. రఘువీర్ భార్య లక్ష్మి, వీరికి ఇద్దరు సంతానం కూతురు ఈశాన్వీరెడ్డి, కుమారుడు గౌతమ్ జానారెడ్డి ఉన్నారు. రఘువీర్‌కు గతంలో రాజకీయ అనుభవం లేదు. 

గెలుపునకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు

తెలంగాణలో రికార్డు స్థాయిలో భారీ మెజార్టీ అందించిన నల్లగొండ ప్రజలకు ఎల్లప్పుడు రుణపడి ఉంటాను. నిరంతర నా గెలుపు కోసం కృషిచేసిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. నల్లగొండ ప్రజలకు ఎల్లవేళలలా అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తాను. నియోజకవర్గం మరింత అభివృద్ధి చేసేందుకు ఢిల్లీ నుంచి నిధులు తీసుకొస్తాను.

 రఘువీర్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ