16 May, 2026 | 2:31 PM

ఉద్యమకారుల సహనాన్ని పరీక్షించొద్దు.. కమిటీల డ్రామాలు ఆపండి!

16-05-2026 01:54 PM

మహబూబాబాద్, (విజయక్రాంతి): ఉద్యమకారుల సహనాన్ని పరీక్షించొద్దని, కమిటీల పేరుతో డ్రామాలు ఆపివేయాలని, జూన్ 2 లోగా డిమాండ్లు తేల్చకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి 'తెలంగాణ ఉద్యమ కారుల సెగ' తప్పదని మహబూబాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, తెలంగాణ ఉద్యమకారుడు ఎండీ ఫరీద్ అన్నారు..తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) వేసిన సబ్‌ కమిటీలు కేవలం కాలయాపన డ్రామాలేనని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

హామీలను తుంగలో తొక్కి, ఉద్యమకారుల కళ్ళల్లో ఆనాడు ఉప్పు చల్లిన పాలకులు, నేడు కమిటీల ముసుగులో మళ్లీ మోసం చేయాలని చూస్తే సహించేది లేదని, తెలంగాణ కోసం పోరాడిన ప్రతి ఉద్యమకారుడి కుటుంబానికి తక్షణమే 500 గజాల ఇళ్ల స్థలాన్నికేటాయించి ప్రభుత్వం తన కృతజ్ఞతను చాటుకోవాలన్నారు. ఉద్యమకారులందరికీ నెలకు 25 వేల రూపాయలు గౌరవ వేతనం అందించి గౌరవప్రదంగా ఆదుకోవాలన్నారు.

ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలు నేటికీ రోడ్డున పడి న్యాయం కోసం ఏడుస్తుంటే.. ప్రభుత్వం కమిటీలతో కాలక్షేపం చేయడం దుర్మార్గం. తక్షణమే ఆ కుటుంబాలకు భారీ ఆర్థిక సహాయం అందించాలని, ఉద్యమ సమయంలో యువతపై, విద్యార్థులపై పెట్టిన అక్రమ పోలీస్ కేసులను ఎలాంటి మెలికలు లేకుండా తక్షణమే రద్దు చేయాలన్నారు.