కేసీఆర్ పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం స్వస్తి
మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్ రెడ్డి, జైపాల్ యాదవ్
కల్వకుర్తి / పెంట్లవెల్లి, ఆగస్టు 17: కేసీఆర్ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్రెడ్డి, జైపాల్ యాదవ్ ఆరోపించారు. బీఆర్‌ఎస్ పిలుపు మేరకు సోమవారం కల్వకుర్తి, పెంట్లవెల్లి తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిర్వహించిన నిరసనల్లో వారు పాల్గొన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు వంటి పథకాలతో గత ప్రభుత్వం పేదలు, రైతులకు అండగా నిలిచిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరిస్తోందని విమర్శించారు. కొల్లాపూర్ రైతాంగానికి సాగునీరు అందించాలని బీరం డిమాండ్ చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమాల్లో బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
తొలిరోజే నిరసన సెగ
అయిజ, ఆగస్టు 17:అయిజ మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీడీవో భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావాణికి 24 వినతులు అందాయి. పులికల్ గ్రామ భూవివాదంపై బాధితులు నిరసన వ్యక్తం చేశారు. హనుమక్క (బసివిరాలి) పేరున ఉన్న భూమిని అనర్హుల పేర్లపై మార్చారని ఆరోపిస్తూ, అక్రమ బదలాయింపులు రద్దు చేసి అసలు వారసుల పేర్లపై నమోదు చేయాలని ఎమ్మార్పీఎస్ రాజు కోరారు. పేదలకు ఉపయోగపడుతున్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని టీఆర్‌ఎస్ కార్యకర్తలు కోరారు.
అయిజ పట్టణంలో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు వినతిపత్రం సమర్పించారు. నకిలీ విత్తనాల కారణంగా మిర్చి పంట దెబ్బతిందని రైతు ఫిర్యాదు చేశారు. కాగా, హనుమక్క పేరున ఉన్న భూమిని నిబంధనల ప్రకారమే వారసులకు బదిలీ చేసినట్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్ రజనీకాంత్రెడ్డి తెలిపారు.
పథకాలను పునరుద్ధరించాలి
గద్వాల టౌన్, ఆగస్టు 17:పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సోమవారం గద్వాల జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టారు. వైఎస్సార్ చౌరస్తాలో నిర్వహించిన ఆందోళనకు బీఆర్‌ఎస్ గద్వాల ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు నాయకత్వం వహించా రు. ఈ సందర్భంగా నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ శివకుమార్కు వినతిపత్రం అందజేశారు. అర్హత ఉన్నప్పటికీ పథకాల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులు ఇబ్బందులు పడు తున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులందరికీ సాయం అందించాలని బాసు హనుమంతు నాయుడు డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే ఆల ఆధ్వర్యంలో..
భూత్పూర్, ఆగస్టు 17 : కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కొనసాగించాలంటూ భూత్పూర్ పట్టణంలోని బిఆర్‌ఎస్ శ్రేణులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేస్తుందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా ఎత్తివేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
కెసిఆర్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిరుపేద కుటుంబాలకు ఆడపిల్లల వివాహ సమయంలో ఆర్థిక భరోసాగా నిలిచాయని అన్నారు. అలాంటి పథకాలను ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎగొట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. ఎన్నికల సమయంలో తులం బంగారం అదనంగా ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పథకం పూర్తిగా ఎత్తివేయాలని చూడడం విడ్డూరమన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎత్తివేయాలని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ బస్వ రాజ్ గౌడ్, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నారాయణ గౌడ్, మురళీధర్ గౌడ్, గోప్లాపూర్ సత్యనారాయణ, తూము శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ గడ్డం ప్రేమ్ కుమార్, రాము నాయక్, ఆగిరి వెంకటేష్, సురేష్ గౌడ్ తో పాటు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
పథకాలను అమలు చేయాల్సిందే
మహమ్మదాబాద్/గండీడ్, ఆగస్టు 17 : కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు పేద ఆడబిడ్డల పెళ్లిలకు ఎంతో భరోసాగా ఉన్నాయని వాటిని కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నంచర్ల గేటు దగ్గర ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.
మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ కోర్టు నాలుగుసార్లు గడువు ఇచ్చినప్పటికీ రేవంత్రెడ్డి ప్రభుత్వం కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కాదని, తెలంగాణ పేద కుటుంబాల ఆడబిడ్డల భవిష్యత్తు, ఆత్మగౌరవంతో ముడిపడిన పథకాలని అన్నారు. ఈ కార్యక్రమం బీఆర్‌ఎస్ అధ్యక్షుడు దిడ్డికాడి గోపాల్ తదితరులు ఉన్నారు.
కొనసాగించాలి
వీపనగండ్ల, ఆగస్టు 17 : కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ నాయకులు సోమవారం నిరసన చేపట్టారు. పెండింగ్లో ఉన్న అర్హులైన లబ్ధిదారులకు వెంటనే నిధులు విడుదల చేయాలని, పథకాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పథకాల అమలుకు బీఆర్‌ఎస్ ధర్నా
చిన్నంబావి, ఆగస్టు 17: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, పేదల సంక్షేమ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






