వెయ్యి కోట్ల ఆసుపత్రి ఓపీకేనా?
- ఆలోచన, ఆచరణ కేసీఆర్‌ది.. ప్రచారం కాంగ్రెస్‌ది
- పేరు మార్చినంత సులువుగా ఆస్పత్రులు కట్టలేరు
- పూర్తి ఉచితంగా టిమ్స్‌లో వైద్య సేవలు అందించాలి
- మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి): ఆలోచన, ఆచరణ కేసీఆర్‌ది అయితే ప్రచారం మాత్రం కాంగ్రెస్ పార్టీ చేసుకుంటోందని మాజీ మంత్రి హరీశ్‌రావు సోమవారం ఎక్స్ వేదికగా విమర్శించారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు రేవంత్‌రెడ్డి నియామక పత్రాలు ఇచ్చినట్టే.. కేసీఆర్ ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రుల ప్రారంభోత్సవాల పేరుతో ప్రచారం చేసుకుంటోందని ఎద్దేవా చేశారు.
డేట్లు, డెడ్‌లైన్లు మార్చుకుంటూ పోయి, చివరకు సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తున్న ఆసుపత్రిలో కూడా పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురాకపోవడం శోచనీయమని మండిపడ్డారు. హైదరాబాద్‌కు మూడు వైపులా మూడు టిమ్స్ ఆసుపత్రులు ఏర్పాటు చేసి, పేదలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలన్నది కేసీఆర్ ఆలోచన అని, కరోనా తర్వాత భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని, వందేళ్ల ముందు చూపుతో కేసీఆర్ టిమ్స్‌లకు రూపకల్పన చేశారని గుర్తు చేశారు.
2022 ఏప్రిల్ 26న ఒకేరోజు మూడు ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకు శంకుస్థాపన చేసి చరిత్ర సృష్టించారని, ప్రణాళిక.. శంకుస్థాపన.. నిధులు విడుదల చేసింది కేసీఆర్ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో శరవేగంగా సాగిన పనులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నత్తనడకన సాగాయని, సకాలంలో పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
మూడున్నరేళ్ల సుదీర్ఘ కాలంలో పూర్తిస్థాయి సదుపాయాలు కల్పించకుండా, కేవలం ప్రచారం కోసమే సనత్‌నగర్ టిమ్స్‌ను ప్రారంభిస్తున్నారని, కనీసం ఆసుపత్రికి నీటి సరఫరా కూడా కల్పించలేదు అంటే పేదల వైద్యం పట్ల వీరికి ఉన్న శ్రద్ధ ఏమిటో అర్థం అవుతుందని తెలిపారు. కేసీఆర్ పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలని ఆలోచిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పేదల నుంచి ఫీజులు వసూలు చేయాలని నిర్ణయించిందన్నారు.
ఈ ఆసుపత్రులు సకాలంలో పూర్తయి ఉంటే ఇప్పటికే వేలాది మంది పేదలు అత్యున్నత వైద్య సేవలు పొందేవారు.. ఎంతో మంది ప్రాణాలు నిలిచేవని, ఇన్నేళ్లుగా ఆసుపత్రుల నిర్మాణాలు పూర్తి చేయకుండా, ప్రజలకు వైద్యం అందకుండా చేసిన జాప్యానికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కండ్లు తెరచి టిమ్స్, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. పేదల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయకుండా పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు.






