18 August, 2026 | 2:08 AM

మహేష్‌గౌడ్ డైలమా!

18-08-2026 01:07 AM
  1. రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మెతక వైఖరి
  2. పార్టీ లైన్ దాటొద్దంటూ హెచ్చరికలు
  3. చర్యలపై మాత్రం సైలైంట్
  4. అధిష్ఠానానిదే నిర్ణయమంటూ దాటవేత
  5. పీసీసీ చీఫ్ తీరుపై కాంగ్రెస్‌లోనే చర్చ   

హైదరాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి): కాంగ్రెస్‌లో సొత పార్టీ నేతలే గళం విప్పుతున్న వేళ.. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ ఏం చేయాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారా? ఒక వైపు పార్టీ లైన్ దాటొద్దం టూ నేతలకు హెచ్చరికలు.. మరో వైపు సర్దిచెప్పే వ్యాఖ్యలు.. ఈ రెండు భిన్న సంకేతాలి వ్వడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీపై, ప్రభుత్వ తీరుపై చేసిన ఘాటు వ్యాఖ్యలో నేపథ్యంలో మహేష్‌కుమార్‌గౌడ్ స్పందించిన తీరు రాజకీయంగా ఆసక్తిని రేకిత్తిస్తోంది. ‘కాంగ్రెస్ పార్టీతోనూ.. తెలంగాణతోనూ.. తెలంగాణ ఉద్యమంతోనూ సంబంధం లేని వారందరూ ఇప్పు డు తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారనే అర్థంలో రాజగోపాల్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాం శం కాగా, పార్టీలోనూ కలకలం సృష్టించాయి. 

ఈ నేపథ్యంలో స్పందించిన పీసీసీ చీఫ్.. పార్టీకి వ్యతిరేకంగా ఎవరూ వ్యాఖ్యలు చేయవచద్దని, పార్టీ లైన్ దాటవద్దని హెచ్చరించారు. కానీ చర్యలు తీసుకునే విషయం లో మాత్రం సైలెంట్ అయ్యారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో కఠినంగా వ్యవహరించాల్సింది పోయి ఆచితూచి మాట్లాడటం పార్టీలో కొత్త చర్చకు తెరలేపింది. రాజగోపాల్‌రెడ్డికి గతంలో మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చి ఉండవచ్చని పేర్కొనడం, ఇక్కడ జరుగుతున్న సంగతులన్నీ హైకమాండ్‌కు విన్నవిస్తానంటూ చెప్పుకొచ్చారు. 

ఓసీ నేత కావడం వల్లేనా?

లైన్ దాటి పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్న రాజగోపాల్‌రెడ్డి లాంటి నేతలపై పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అందరూ వేలెత్తి చూపుతున్నారు. అదే బీసీ, దళిత వర్గాల నేతలైతే ఇప్పటికే షోకాజ్ నోటీసులు ఇచ్చి చర్య లు తీసుకునేవారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేవలం ఓసీ నేత కావడంతోనే రాజగోపాల్‌రెడ్డికి కనీసం షోకాజ్ నోటీసులైనా ఇచ్చేందుకు పీసీసీ వెనుకాడుతున్నట్టు చర్చ జరుగుతోంది.

రాజగోపాల్‌రెడ్డి చేస్తున్న హాట్ కామెంట్లకు పీసీసీ అధ్యక్షుడు కక్కామింగలేని పరిస్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. పైగా మహేష్‌కుమార్ గౌడ్ వ్యాఖ్యలు కూడా ఆయనలోని అయోమయాన్ని తెలియజేస్తున్నాయి. ఓ పక్క పార్టీ లైన్ దాటవద్దని చెబుతూనే.. పార్టీ గతంలో హామీ ఇచ్చి ఉండవచ్చని అంటున్నారంటే.. రెండు పడవలపై పీసీసీ చీఫ్ ప్రయాణం చేస్తున్నారనే చర్చ నడుస్తోంది. ఆయన వైఖరితో పార్టీ కార్యకర్తల్లోనూ అయోమయం నెలకొంది. ఏదేమైనా.. కర్ర విరక్కుండా, పాము చావకుండా అన్నట్టుగా సన్నాయి నొక్కు లు నొక్కడంతో.. అందరిలోనూ అదే అయోమయం కనపడుతోంది.