40వేల మెజార్టీతో కాంగ్రెస్ గెలుపు ఖాయం
- కేసీఆర్, కిషన్‌రెడ్డి కలిసి బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డిని బలి చేస్తున్నారు
- పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ డిమాండ్
- గుర్గావ్‌లో నాకు ఇల్లు ఎక్కడిది..ఐటీ దాడులెక్కడివి?
- హరీశ్ మతిభ్రమించి మాట్లాడారు
- డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి) : జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 30 వేల నుంచి 40 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తారని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ తెలిపారు. బీఆర్ ఎస్ పార్టీ ఫేక్ సర్వేలు చేసుకుని భ్రమలో ఉందని, గత బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనను చూసే ఆ పార్టీని ప్రజలు ఓడించారని అన్నా రు. కేసీఆర్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కలిసి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని బలి చేస్తున్నారని చెప్పారు.
ఆదివారం జూబ్లీహిల్స్ నియోజక వర్గంలోని యూసుఫ్‌గూడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావుతో కలిసి మహేష్‌కుమార్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు. బీజేపీతో పాటు ఎవరికి ఓటు వేసినా నోటాకు ఓటు వేసినట్లే అవుతుందన్నారు. బీఆర్‌ఎస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే తమ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌పై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
రెండేండ్ల మా పాలన చూసి జనాలు మాకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని, బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రజలు తిప్పికొడుతున్నారని మహేష్‌కుమార్‌గౌడ్ చెప్పారు. ఇతర కుటుంబాల్లో తలదూర్చే ఆలోచన కాంగ్రెస్ పార్టీ కి లేదని, మాగంటి గోపినాథ్ తల్లికి కేటీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గోపినాథ్ అంత్యక్రియల్లో పాల్గొనకూడదని మాగంటి కుటుంబ సభ్యులకు ఎందుకు చెప్పారని ఆయన నిలదీశారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ నవీన్ యాదవ్ సేవకుడని.. జూబ్లీహిల్స్ ప్రజలు అతన్ని గెలిపించుకోవాలన్నారు. బలహీనవర్గాల వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని, నవీన్‌కు ఏ పదవీ లేకుండానే అనేక సామాజిక కార్యక్రమాలు ఆయన చేశారని భట్టి పేర్కొన్నారు. రెండేళ్ల తమ ప్రభుత్వ పాలనలో దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి కార్యక్రమా లు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు.
గుర్గావ్‌లో తనకు ఇల్లు ఉందని, అక్కడి నుంచి బీహార్ ఎన్నికలకు డబ్బులు పంపిస్తున్నట్లుగా, ఐటీ రైడ్స్ జరిగినట్లుగా మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన ఆరోపణలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖండించారు. పదేళ్లుగా మంత్రిగా పని చేసిన హరీశ్‌రావుకు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని, మతి భ్రమించి మాట్లాడొద్దని హితవు పలికారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని జూబ్లీహిల్స్ ప్రజలకు సూచించారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగా నే రేషన్ కార్డులు ఇచ్చామని మంత్రి ఉత్తమ్ వివరించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌కు ఓటు అడిగే హక్కులేదన్నారు. మూడు పర్యాయాలు వాళ్ల అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉన్నా నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కూడా జరగలేదన్నారు.
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ నేతలు ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కారుకు ఓటేస్తే కమలంకి ఓటు వేసినట్టేనని తెలిపారు. మం త్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ 11 వ తేదీన జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు.
బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ చట్టం చేసిన సందర్భంలో బలహీనవర్గాల బిడ్డకు కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్‌లో టికెట్ ఇచ్చిందన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉండి ఇక్కడ చేసిందేమీ లేదని, జూ బ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ మరొ పీజేఆర్ అవుతాడని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.






