14-02-2026 12:00:00 AM
సంగారెడ్డి/జహీరాబాద్/నారాయణఖేడ్/పటాన్చెరు/సదాశివపేట/గుమ్మడిదల, ఫిబ్రవరి 13 : మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠగా వెలువడ్డాయి. శుక్రవారం సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీలకు ఫలితాలను వెల్లడించారు. జిల్లాలో సంగారెడ్డి, సదాశివపేట, నారాయణఖేడ్, ఆందోల్-జోగిపేట మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా గడ్డపోతారం, గుమ్మడిదల, ఇంద్రేశం స్థానాలను బీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది.
సంగారెడ్డి మున్సిపాలిటీలోని 38 వార్డులకు గాను 22 కాంగ్రెస్, 10 బీఆర్‌ఎస్, 2 బీజేపీ, 1 ఎంఐఎం, 3 స్వతంత్రులు గెలుపొందారు. సదాశివపేటలో 26 వార్డులకు గాను 16 వార్డులు కాంగ్రెస్, 8 బీఆర్‌ఎస్, ఒకటి బీజేపీ, మరొకరు స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఈ రెండు మున్సిపాలిటీలలో జగ్గారెడ్డి మార్క్ కనిపించింది. స్థానిక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రభావం చూపలేక పోయారు.
సదాశివపేట, సంగారెడ్డిలో ముందుగానే చైర్మన్ అభ్యర్థులను జగ్గారెడ్డి ప్రకటించారు. సంగారెడ్డిలో 23వ వార్డు నుండి పోటీ చేసిన కూన సంతోష్ సతీమణి వనిత పేరును ప్రకటించారు. అలాగే సదాశివపేట మున్సిపాలిటీలో 20వ వార్డు అభ్యర్థిని మునిపల్లి సత్యనారాయణ సతీమణి అంజమ్మ చైర్మన్గా బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రాతినిద్యం వహిస్తున్న ఈ రెండు మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకోవడం గమనార్హం.
ఆందోల్, నారాయణఖేడ్లో కాంగ్రెస్ హవా..
నారాయణఖేడ్ మున్సిపల్ పీఠం ను కాంగ్రెస్ పార్టీ వశపర్చుకుంది, దీంతో కాంగ్రెస్ నాయకుల్లో ఉత్సాహం నెలకుంది. స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎంపీ సురేష్ కుమార్ షట్కార్ ఇంట్లో కార్యకర్తలు సంబరాల్లో మునిగితేలారు. నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో మొత్తం 15 కౌన్సిలర్ వార్డులు ఉండగా ఇందులో కాంగ్రెస్ 11 స్థానాలను కైవసం చేసుకోగా, బిఆర్‌ఎస్ మూడు స్థానాలు కైవసం చేసుకుని తన మనుగడను నిలబెట్టుకోగా నారాయణఖేడ్ మున్సిపల్ లో మొదటిసారిగా ఒకటో వార్డులో బిజెపి అభ్యర్థి పత్రి లలిత గెలుపొంది బోణి కొట్టింది.
దీంతో బిజెపి కార్యకర్తల్లో ఆనందం నెలకొంది. అలాగే ఆందోల్-జోగిపేట మున్సిపాలిటీలో సైతం కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగించింది. మంత్రి దామోదర రాజనర్సింహ్మ ఇలాఖాలో బీఆర్‌ఎస్ చతికిలపడింది. మొత్తం 20 వార్డులకు గాను 16 కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. కేవలం 3 స్థానాల్లో బీఆర్‌ఎస్, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.
రెండు స్థానాల్లో బీఆర్‌ఎస్ గెలుపు..
జిల్లాలోని పటాన్చెరు నియోజకవర్గం గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపాలిటీలను బీఆర్‌ఎస్ గెలుపొందింది. ఈ రెండు కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు. గడ్డపోతారంలో 18 వార్డులకు గాను 14 స్థానాలను బీఆర్‌ఎస్ గెలుపొందగా, కేవలం 3 స్థానాలకే కాంగ్రెస్ పరిమితమైంది. ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. గుమ్మడిదల మున్సిపాలిటీలో 22 వార్డులకు గాను 15 స్థానాల్లో బీఆర్‌ఎస్ ప్రభంజనం సృష్టించింది. కేవలం 4 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ గెలుపొందగా, బీజేపీ 2 స్థానాలు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు గెలుపొందారు. దీంతో ఈ రెండు పీఠాలు గులాబీ కైవసం అయ్యాయి.
ఐదు స్థానాల్లో హంగ్..
జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో నాలుగింట కాంగ్రెస్, రెండింట బీఆర్‌ఎస్ గెలుపొందగా ఐదు స్థానాల్లో హంగ్ ఏర్పడింది. జహీరాబాద్ మున్సిపాలిటీలో 37 వార్డులకు గాను 14 స్థానాల్లో కాంగ్రెస్, 15 స్థానాల్లో బీఆర్‌ఎస్, 3 బీజేపీ, 2 ఎంఐఎం, 3 స్థానాల్లో స్వతంత్రులు గెలుపొందారు. ఇక్కడ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాణిక్ రావు ప్రాతినిద్యం వహిస్తుండగా కాంగ్రెస్ ఎంపీగా సురేష్ శెట్కార్ ఉన్నారు.
ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. దీంతో క్యాంపు రాజకీయాలు ప్రారంభించారు. అలాగే ఇస్నాపూర్ మున్సిపాలిటీలో 26 వార్డులకు 10 స్థానాల్లో కాంగ్రెస్, 12 స్థానాల్లో కాంగ్రెస్, 4 స్థానాల్లో స్వతంత్రులు గెలుపొందారు. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 14 కావడంతో తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. స్వతంత్రులను బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు క్యాంపుకు తరలించేందుకు ప్రయత్నించగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
అభ్యర్థులను బలవంతంగా తరలించేందుకు ప్రయత్నించగా లాఠీచార్జి చేశారు. అలాగే జిన్నారం మున్సిపాలిటీలో 20 వార్డులకు 6 కాంగ్రెస్, 8 స్థానాలు బీఆర్‌ఎస్, 4 బీజేపీ, ఒకరు ఇండిపెండెంట్ గెలపొందారు. మ్యాజిక్ ఫిగర్ 10 కావడంతో ఎవరికి పీఠం వరిస్తుందో తెలియడం లేదు. ఇంద్రేశం మున్సిపాలిటీలో సైతం హంగ్ ఏర్పడింది. ఇక్కడ 18 వార్డులకు 6 కాంగ్రెస్, 9 బీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందారు.
2 బీజేపీ, ఒకరు స్వతంత్ర అభ్యర్థి గెలుపొందగా ఎవరికి పీఠం దక్కుతుందోననే ఉత్కంఠ నెలకొంది. కోహీర్ మున్సిపాలిటీలో సైతం 16 వార్డులకు గాను 8 స్థానాల్లో కాంగ్రెస్, 5 బీఆర్‌ఎస్, 1 బీజేపీ, 1 ఎంఐఎం, 1 స్వతంత్ర అభ్యర్థి గెలుపొందడంతో మ్యాజిక్ ఫిగర్ కోసం కాంగ్రెస్ విశ్వప్రయత్నం చేస్తోంది. ఇక్కడ ఇద్దరి మద్దతు లభిస్తే కాంగ్రెస్ చైర్మన్ అయ్యే అవకాశం ఉంది. ఈనెల 16న హంగ్ ఏర్పడిన స్థానాల్లో ఏ పార్టీ గెలుపొందుతుందో తేలిపోనుంది.