12 June, 2026 | 5:49 PM

శ్రీధర్ బాబును విమర్శిస్తే పుట్ట మీ రాజకీయ సమాధికి మేమే పునాది వేస్తాం

12-06-2026 04:46 PM

 జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జనగామ నర్సింగరావు హెచ్చరిక

మంథని,(విజయక్రాంతి): రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుపై నోరు పారేసుకుంటే పుట్ట మధు ఇక మీ రాజకీయ భవిష్యత్తును మంథని గడ్డపై లేకుండా చేస్తామని, మీ రాజకీయ సమాధికి మేమే పునాది వేస్తామని, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జనగామ నర్సింగరావు బిఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి ఘాటుగా హెచ్చరించారు. శుక్రవారం మంథని లో మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుట్ట మధు తీరు బిఆర్ఎస్ శ్రేణుల్లో కలకలం రేపిందని, రాజకీయ స్వలాభం కోసం లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు మాట్లాడి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాడని విమర్శించారు.

 ప్రజలు దొంగలుగా చూస్తున్నారు

 గత మూడు రోజులుగా బిఆర్ఎస్ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలు, విష ప్రయోగాలు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మంథని ప్రజలు మిమ్మల్ని దొంగల్లా చూస్తుంటే, దాన్ని జీర్ణించుకోలేక ప్రభుత్వంపై విషం కక్కుతున్నారు" అని నర్సింగరావు ధ్వజమెత్తారు.

 తిరగబడితే బయటకు రాలేరు

మంత్రి ఒక్క మాట చెబితే చాలు.. మేమంతా రంగంలోకి దిగి తిరగబడితే, మంథనిలో బిఆర్ఎస్ నాయకులు కాలు మోపే పరిస్థితి కూడా ఉండదని గుర్తుంచుకోండని బహిరంగంగా హెచ్చరించారు.

 పుట్ట మధుపై తీవ్ర వ్యాఖ్యలు

 పుట్ట మధును ఉద్దేశించి మాట్లాడుతూ, "దుద్దిల్ల కుటుంబం దగ్గర శిష్యరికం చేసి, ఆ కుటుంబం వల్లే అన్నీ పొంది, నేడు అదే కుటుంబంపై విమర్శలు చేయడం సిగ్గుచేటని, న్యాయవాద జంట హత్యల కేసులో మీ మేనల్లుడు రిమాండ్‌లో ఉన్నాడని, ఆ ఘటనలో మీ ప్రమేయంపై ప్రజల్లో ఉన్న అసహ్యాన్ని, ఫ్రస్టేషన్‌ను ఇలాంటి అసత్య ప్రచారాలతో కప్పిపుచ్చుకోవాలని చూడకండి" అని నిప్పులు చెరిగారు.

  మతిభ్రమించిన బిఆర్ఎస్ నాయకులు

 అధికారం కోల్పోయి, రాజకీయ ఉనికిని కాపాడుకోలేక బిఆర్ఎస్ నేతలు పూర్తి మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.