29 August, 2026 | 6:31 PM

బోథ్ కాంగ్రెసులో కల్లోలం.. కార్యకర్తల్లో అయోమయం

29-08-2026 04:55 PM

బోథ్,(విజయక్రాంతి): బోథ్నియోజకవర్గంకాంగ్రెస్ పార్టీలో కల్లోలం రేగింది. నివురు గప్పిన నిప్పులా ఉన్న కాంగ్రెస్ పార్టీ గ్రూపు రాజకీయాలు ఒక్కసారిగా హై కమాండ్ దృష్టికి వెళ్లే విధంగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కిందిస్థాయి నాయకులు కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి అనుచరులు డిసిసి అధ్యక్షునిపై ఫిర్యాదు చేసేందుకు శనివారం హైదరాబాద్ తరలి వెళ్లారు. ఫలితంగా వారి వారి అనుచర వర్గం ఆందోళనకు గురవుతున్నది. 

పార్టీ బలపడుతున్న నేపథ్యంలో

నియోజకవర్గంలో గత 40 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలుపు పొందలేదు. అయితే ప్రస్తుత సమయం లో పార్టీ బలపడుతుండడంతో కార్యకర్తల్లో ఆశలు చివరించాయి. అయితే ఒకే సామాజిక వర్గానికి చెందిన నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాదవ్ నరేష్ పై ఫిర్యాదు చేసేందుకు అనుసర వర్గంతో వెళ్లడంతో నియోజకవర్గంలోని అందిస్తాయి కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. నమ్ముకున్న నాయకులు గ్రూపులు కడితే మన భవిష్యత్తు ఏమిటని చర్చించుకుంటున్నారు. 

చిచ్చురేపిన కమిటీ కన్వీనర్ రా నియామకం

నియోజకవర్గంలోని ఆయా మండలాలకు కన్వీనర్లను నియమించారు. అయితే కన్వీనర్ నియామకం ఏకపక్షంగా జరిగిందంటూ నియోజకవర్గ ఇన్చార్జి బోథ్ మండల కన్వీనర్ను మార్చడం జరిగింది. దీంతో పార్టీలో అసమ్మతిగ్రూపులు బయటపడ్డాయి. అప్పటినుండి ఆ పార్టీలో కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. ఒకవైపు పార్టీ బలపడుతున్న నేపథ్యంలో మరోవైపు గ్రూపు విభేదాలు బయటపడడం రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది.

నామినేటెడ్ పోస్టులు భర్తీకి నాయకులు ఎవరి అనుచరులకు వారు పదవులు పట్టబట్టే ప్రయత్నం చేస్తుండటంతో పరస్పర ఫిర్యాదులకు తెరలేపిందని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇద్దరు నాయకులు వారి వారి అనుచరుల పేర్లను అధిష్టానానికి పంపించడంతో క్రింది స్థాయిలో సైతం గ్రూపులు కడుతున్నారు. మేమంతా ఒకటే మాలో గ్రూపులు లేవని బహిరంగ సభలో ప్రకటించిన నాయకులు ఇప్పుడు గ్రూప్ విభేదాలతో ఫిర్యాదుల వరకు వెళ్లడం ఆ పార్టీలో చర్చకు దారి తీసింది. ఏది ఏమైనా నియోజకవర్గం పరిధిలోని కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల కల్లోలం రేగింది.