07-11-2025 01:17:30 AM
ఎంఐఎం అభ్యర్థిని ఆ పార్టీ అరువు తెచ్చుకుంది
ఎర్రగడ్డలో ఖబ్రస్థాన్ కోసం స్థలం ఇవ్వడానికి మనసొచ్చింది..
బంజారాహిల్స్‌లో 50 గజాల పెద్దమ్మ తల్లి గుడిని కూల్చేసిన ఘనత కాంగ్రెస్‌ది
హిందువుల ఇజ్జత్ కాంగ్రెస్‌కు అవసరం లేదా?
యూసుఫ్‌గూడ రోడ్‌షోలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, సిటీ బ్యూరో నవంబర్ 6 (విజయక్రాంతి) : ‘ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి ఇజ్జత్ అయితే, హిందువులు ఇజ్జత్ కాదా మిస్టర్ రేవంత్ రెడ్డి? మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో హిందువులకు గౌరవం లేదా?’ అని కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఎంఐఎం చేతిలో కీలుబొమ్మగా మారిందని, హిందువుల ఓటుతో యూసుఫ్‌గూడా సత్తా ఏంటో రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి చూపించాలని ఆయన పిలుపునిచ్చారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గురు వారం యూసుఫ్‌గూడలో నిర్వహించిన రోడ్‌షోలో కిషన్‌రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ నైతికంగా దిగజారిపోయిందని, ఎంఐఎం నుంచి అభ్యర్థిని అరువు తెచ్చుకుని పోటీకి పెట్టాల్సిన దుస్థితి వచ్చిందని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ అభ్యర్థికి ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ బహిరంగంగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. ‘గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసిన వ్యక్తినే నేడు కాంగ్రెస్ బరిలో నిలిపింది.. గుర్తు మారింది కానీ అభ్యర్థి ఒక్కడే. పతంగి గుర్తు స్థానంలో చేయి గుర్తు పెట్టుకుని పోటీ చేస్తున్నాడు, వాస్తవానికి ఆ అభ్యర్థి ఎంఐఎం పార్టీకే చెందిన వాడు. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం ముందు మోకరిల్లింది’ అని విమర్శించారు.
హిందూ వ్యతిరేక విధానాలు..
అధికారంలోకి వచ్చే ముందు కాంగ్రెస్ అన్నీ అబద్ధపు హామీలే ఇచ్చిందని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ‘మహిళలకు ఇస్తామన్న రూ. 2,500 ఎక్కడ? రెండేళ్లలో ఎంతమందికి తులం బంగారం ఇచ్చారు? ఆడబిడ్డలకు స్కూటీలు, విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు, దళితులకు రూ. 12 లక్షలు, బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్.. ఈ హామీలన్నీ ఏమయ్యాయి? ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీయాలి’ అని పిలుపునిచ్చారు.
మంత్రులంతా తమ బాధ్యతలు వదిలేసి, ముస్లిం ఓట్లతో ఎలా గెలవా లో అని ఆలోచిస్తూ జూబ్లీహిల్స్‌లో తిరుగుతున్నారు. ఎర్రగడ్డలో ఖబ్రస్థాన్ కోసం స్థలం ఇవ్వడానికి మనసొచ్చింది కానీ, బంజారాహిల్స్‌లో 50 గజాల పెద్దమ్మ తల్లి గుడిని కూల్చేసిన ఘనత వీరిది అని విమర్శించారు.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒక్కటే..
పదేళ్లపాటు బీఆర్‌ఎస్, -ఎంఐఎం దోస్తానాను ప్రజలు చూశారని, ఇప్పుడు కాంగ్రెస్ అదే బాటలో పయనిస్తోందని కిషన్‌రెడ్డి అన్నారు. ‘కేసీఆర్ ఇప్పుడు ఫాంహౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఒక్కసారైనా అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలపై మాట్లాడారా? బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే అది మూసీలో వేసినట్టే. ఆ రెండు పార్టీలు కలిసి జూబ్లీహిల్స్‌ను అభివృద్ధిలో వెనక్కి నెట్టాయి’ అని విమర్శించారు.
సన్నబియ్యం పథకం కేంద్ర ప్రభుత్వానిదని, ఓటు వేయకపోతే బియ్యం ఆగిపోతుందని కాంగ్రెస్ నేతలు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ఓట్లు అమ్ముకోవద్దని, ఆత్మగౌరవంతో నిలబడి అభివృద్ధి కోసం బీజేపీని గెలిపించాలని ఆయన కోరారు. అయోధ్యలో దివ్యమైన రామమందిరాన్ని నిర్మించిన ఘనత ప్రధాని మోదీది అని, మన గౌరవం నిలబడాలంటే హిందుత్వం ఉండాలన్నారు. బీజేపీ ఉన్నంతవరకే హైదరాబాద్ ప్రజలకు రక్షణ ఉంటుందని కిషన్‌రెడ్డి ఉద్ఘాటించారు.