ఎమ్మెల్యేకు సీనియర్ల సెగ

15-09-2026 | 11:33pm

- ఎమ్మెల్యే పై సీనియర్ల అసంతృప్తి

- కాంగ్రెస్లో గుప్పుమన్న విబేధాలు 

- అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం

బెల్లంపల్లి,(విజయక్రాంతి): కాంగ్రెస్లో గ్రూపుల గోల శృతిమించిపోయింది. రోజు రోజుకూ గ్రూపుల మధ్య దూరం అందనంత పెరిగిపోతున్నది. ఎన్నికల ముందు నుంచి ఏర్పడిన విభేదాలు సమసిపోవడంలేదు. రోజురోజుకు మరింత బలపడుతున్నాయి. ప్రధానంగా ఎమ్మెల్యేను కేంద్రంగా చేసుకొని కొందరు సీనియర్లు గ్రూపు కట్టి విమర్శల దాడిచేస్తున్నారు. కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం సీనియర్  నాయకులంతా సమావేశం అయ్యారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ పనితీరుపై చర్చించారు. సీనియర్ నాయకులను పట్టించుకోవడం లేదని వాపోయారు. మున్సిపల్ మాజీ చైర్మన్ మత్తమరి సూరిబాబు(Former Municipal Chairman Mattamari Suribabu) అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్(MLA Gaddam Vinod) తీరుపై మండిపడ్డారు.

2023 ఎన్నికల్లో గడ్డం వినోద్ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసి గెలిపించామన్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో కనిపించని ఎంతోమంది పరాన్న జీవులు ప్రస్తుతం ఎమ్మెల్యే చుట్టూ చేరిపోయారన్నారు. ఈ నేపథ్యంలో అప్పటినుంచి సీనియర్లను  పట్టించుకోవడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపల్ మాజీ చైర్మన్ మత్తమరి సూరిబాబు ఎమ్మెల్యే  పనితీరు ను మార్చుకోకపోతే గాంధీభవన్ కి వెళ్లి అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడానికి నియోజవర్గ వ్యాప్తంగా కార్యకర్తలు, నాయకులను కూడగట్టి ఏకమవుతామని అన్నారు. పదవుల కోసం వచ్చిన వాళ్ళు ఆ తర్వాత వెళ్ళిపోతారని ,  తానము స్థానికంగానే ఉంటామని కాంగ్రెస్ పార్టీ కాపాడుకోవడం తమ బాధ్యత అని అన్నారు.

ఎమ్మెల్యే ను లక్ష్యంగా చేసుకొని సూరిబాబు చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరోసారి సొంత పార్టీలో ఒక గ్రూపు ఎమ్మెల్యే పై అసంతృప్తి  వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. సమావేశంలో ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన విభేదాలు  ముదిరిపోతున్నాయి. సందర్భాన్ని బట్టి అవి కాస్త గుప్పుమని అసంతృప్తి కక్కుతున్నాయి. ఇదిలా ఉండగా బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ నుంచి రానున్న ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న నాతరి స్వామి కి ఈ గ్రూపు సన్నిహితంగా ఉంటున్నది.

ఇప్పటి నుంచి కౌంటర్ పాలిటిక్స్ శ్రీకారం చుట్టినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఎమ్మెల్యేకు పోటీగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు కొందరు ఒక వర్గంగా ఏర్పడ్డారు. అవకాశం చిక్కినప్పుడల్లా ఎమ్మెల్యే పై బహిరంగంగా సోషల్ మీడియా వేదికగా విమర్శల దాడి చేస్తున్నారు. బెల్లంపల్లి కాంగ్రెస్ లో నెలకొన్న గ్రూపుల ఆధిపత్య పోరు పై అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి..  ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అఫ్జల్, నాతరీ స్వామి, కటకం సతీష్, మునిమంద రమేష్, నయీమ్, సిలువేరు సత్యనారాయణ, రోడ్డ శ్యామ్ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు