17 July, 2026 | 8:11 AM

జహీరాబాద్‌లో కాంగ్రెస్ పాగా

05-06-2024 01:51 AM

46,188 ఓట్ల మెజార్టీతో సురేష్ కుమార్ షెట్కార్ గెలుపు

రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ 

మూడో స్థానానికి పరిమితమైన గాలి అనిల్‌కుమార్ 

సంగారెడ్డి, జూన్ 4 (విజయక్రాంతి): జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పాగా వేసింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ అన్నట్లుగా ప్రచారం సాగినప్పటికీ, కౌంటింగ్‌లో మాత్రం ప్రతి రౌండ్ లోనూ కాంగ్రెస్ అభ్యర్థి మెజార్టీ సాధించారు. కనీసం ఒక్క రౌండ్‌లో కూడా బీజేపీ అభ్యర్థికి మెజార్టీ రాలేదు. బీఆర్‌ఎస్ పార్టీ మూడో స్థానంలో నిలిచింది. పార్లమెంట్ పరిధిలో అధికంగా ముస్లింలు, క్రైస్తవులు, ఎస్సీలు ఉన్నారు. వీరంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లుగా ఫలితాల సరళి స్పష్టం చేస్తోంది. బీజేపీ రామ మందిరం పేరుతో ప్రచారం చేసినప్పటికీ గెలిచేంత ఓటు బ్యాంకును మాత్రం సమకూర్చుకోలేకపోయింది.  మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మొత్తం 12,35,950 ఓట్లు లెక్కించగా, కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ పై 46,174 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 

స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబం నుంచి..

జహీరాబాద్ ఎంపీగా రెండోసారి గెలుపొందినసురేష్‌కుమార్ షెట్కార్‌ది స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబం. సంగారెడ్డి జిల్లానారాయణఖేడ్‌లో శివరావు షెట్కార్, చంద్రమ్మ దంపతులకు 8 ఆగస్టు 1960లో ఆయన జన్మించారు. మరాఠ్వాడా యూనివర్సిటీలో బీఎస్సీ ఆగ్రికల్చర్ చదువుకున్నారు. తండ్రి శివరావు షెట్కార్ 1985 వరకు నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణఖేడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా సురేష్‌కుమార్ షెట్కార్ గెలిచారు. 2009లో జహీరాబాద్ ఎంపీగా కాంగ్రెస్ తరఫున గెలిచారు. సురేష్‌కుమార్‌కు భార్య ఉమ, కుమార్తెలు గిరిజా, శివాని, కుమారుడు రాకేశ్ ఉన్నారు.  

మతతత్వ పార్టీలకు చెంపదెబ్బ.. 

మతతత్వానికి వ్యతిరేకంగా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు తీర్పు ఇచ్చారు. నా విజయం కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వమే కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణం. పార్లమెంట్ ఎన్నికల ఫలితల్లో ఎన్డీఏ వెనుకబడింది. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయ్యే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడి పని చేసిన నాయకులకు, కార్యకర్తలకు ఎల్లప్పుడు రుణపడి ఉంటాను. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరం చేసేందుకు కృషి చేస్తాను. 


నియోజకవర్గం కాంగ్రెస్       బీజేపీ             బీఆర్‌ఎస్  విజేత    మెజారిటీ

జహీరాబాద్           5,28,147      4,81,973          1,71,997    సురేశ్‌కుమార్ షెట్కార్    46,188