17 July, 2026 | 8:18 AM

ఖాతా తెరవని బీఆర్‌ఎస్

05-06-2024 01:48 AM

లోక్‌సభ ఎన్నికల్లో ఘోర ఓటమి

ఒక్క సీటు కూడా గెలవని పరిస్థితి

ప్రారంభంలో మెదక్‌లో ముందంజ

రౌండ్లు పెరుగుతున్న కొద్ది వెనకంజ 

ఖమ్మంలో రెండో స్థానంలో నిలిచిన గులాబీ 

మిగతా సీట్లలో మూడో స్థానానికే పరిమితం

మెదక్‌లో పోరాడి ఓడిన బీఆర్‌ఎస్ 

అక్కడ వరుసగా నాలుగు పర్యాయాలు గెలుపు

పార్టీ ఓటమితో బోసిపోయిన తెలంగాణ భవన్

హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల ఫలితాలత్లో ఉద్యమ పార్టీగా చెప్పుకునే బీఆర్‌ఎస్ ఖాతా తెరవలేదు. కౌంటింగ్ ప్రారంభం నుంచి మెదక్ స్థానంలో  తప్ప ఎక్కడా మెజార్టీ  చూపలేకపోయింది. ఖమ్మ ంలో మాత్రమే ద్వితీయ స్ధానంలో నిలిచింది. మిగతా సీట్లలో మూడో స్థానానికి పరిమితమైంది.  రాష్ట్ర వ్యాప్తంగా 17 చోట్ల  పోటీ చేసిన గులాబీ పార్టీ మొదటి నుంచి మూడు నుంచి నాలుగు స్థానాల్లో గెలిచి ఉనికి నిలబెట్టుకుంటామని అంచనా వేస్తే అవి తలకిందులైన ఒక సీటు కూడా దక్కించుకోలేదు. పార్టీ చరిత్రలో ఇంత ఘోర ఓటమి ఎప్పుడు చూడలేదు.

ఈఎన్నికల్లో కాంగ్రెస్ 8 , బీజెపీ 8 , మజ్లిస్ తన  కంచుకోటలో విజయం సాధించింది. అసెంబ్లీలో ఎన్నికల్లో  ఓడిపోయి పార్లమెంటు ఎన్నికల్లో సత్తాచాటాలని ప్రణాళికలు వేసిన ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు నిరాశే ఎదురైంది. 2004 నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధిస్తుంది.  ఈసారి జరిగిన ఈఎన్నికల్లో అంచనాలు తలకిందులయ్యాయి.  కేసీఆర్ బస్సుయాత్రతో పార్టీకి మంచి ఊపు రాగా పార్లమెంటు ఎన్నికల్లో పరువు దక్కుతుందని భావించారు. కానీ ఎవరు ఊహించని ఫలితాలను చూశారు. రైతు బంధు పంపిణీ ఆలస్యం, విద్యుత్ కోతలు, ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ అమలు చేయలేదని, ఈ అంశాలను తమకు అనుకూలంగా మారుతాయని అంచనా వేస్తే ప్రజలు ఆదరించలేదు. 

మెదక్‌లో పోరాడి ఓడిన బీఆర్‌ఎస్ 

బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్ సొంత జిల్లా మెదక్‌లో షాక్ తగిలించింది. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో  ఆపార్టీ అక్కడ వరుస విజయాలు నమోదు చేసింది. ఈసారి ఊహించని విధంగా ఓడిపోయింది. మెదక్ నియోజకవర్గం నుంచి మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామ్‌రెడ్డి బరిలో నిలవగా బీజేపీ నుంచి రఘునందన్‌రావు, కాంగ్రెస్ నుంచి నీలం మధు పోటీ చేశారు. ప్రారంభంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి వెంకట్రామ్‌రెడ్డి  ఆధిక్యత కనబరచగా రౌండ్లు పెరుగుతున్న కొద్దీ వెనకబడ్డారు.

ఇక్కడ విజయం సాధించేందుకు మాజీ మంత్రి హరీశ్‌రావు అనుచరులతో  రాత్రింబవళ్లు తీవ్రంగా శ్రమించారు. మాజీ సీఎం సొంత జిల్లాలో ఓటమి చవిచూస్తే పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందని భావించి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ధీటుగా ప్రచారం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల మద్దతు కూడా పెద్ద సంఖ్యలో కూడగొట్టారు. కేసీఆర్ బస్సుయాత్ర ముగింపు సభ కూడా మెదక్ నియోజకవర్గంలో నిర్వహించారు. ఈ స్థాయిలో ప్రచారం చేయడంతో కచ్చితంగా బీఆర్‌ఎస్ గెలుస్తుందని భావించినా చివరికి ఓటమి చవి చూశారు.

5 సీట్లతో మొదలై సున్నాకు గులాబీ..

ఉద్యమ పార్టీగా ప్రారంభమైన బీఆర్‌ఎస్ సాధారణ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు ఎదుర్కొని రాజకీయంగా నిలదొక్కుకుంది. మొదటిసారిగా 2004 ఎన్నికల్లో ఆరు స్ధానాల్లో పోటీ చేసి ఐదు సీట్లు, 2009 ఎన్నికల్లో  మహబూబ్‌నగర్ నుంచి కే చంద్రశేఖర్ రావు, మెదక్ నుంచి విజయశాంతి గెలుపొందారు. స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో 12 సీట్లలో విజయం సాధించగా, 2019లో 9 స్థానాలు కైవసం చేసుకుంది.

2024 ఎన్నికల్లో సున్నాకే పరిమితమైంది. డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  బీఆర్‌ఎస్ అధికార పక్షం నుంచి ప్రతిపక్ష స్ధానానికి దిగజారింది. 39 సీట్లు గెలుచుకుంది. రెండు పర్యాయాలు అధికారం చేపట్టిన ఆపార్టీ మూడోసారి ఓటమి చెందింది. అప్పటి నుంచి గులాబీ పార్టీకి ప్రజాదరణ కోల్పోయింది. లోక్‌సభ ఎన్నికల్లో పూర్తిగా తుడుచుక పెట్టుకపోయింది. భవిష్యత్తులో జరగనున్న ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఏమిటని కార్యకర్తలు మథనపడుతున్నారు.

బోసిపోయిన తెలంగాణ భవన్

నిత్యం వందలాది మంది కార్యకర్తలతో సందడిగా కనిపించే తెలంగాణ భవన్ ఎన్నికల ఫలితాలు తరువాత  బోసిపోయింది. అటువైపు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు రాలేదు. కార్యాలయం సిబ్బంది తప్ప కండువా ధరించిన నేతలు మచ్చుకు కనిపించలేదు. కొంతమంది కార్యకర్తలు రెండు,మూడు సీట్లు గెలిస్తే సంబరాలు చేసుకుందామని ఏర్పాట్లు చేసుకున్నారు. ఫలితాలను చూసి తరువాత అటువైపు కన్నెత్తి చూడలేదు. బీఆర్‌ఎస్ ఎప్పడు పోటీ చేసినా మంచి ఫలితాలు సాధించేది, ఈసారి జరిగిన ఎన్నికల్లో భారీ షాక్ తగిలింది.