16 July, 2026 | 12:31 PM

అలా ఏం కాదు..!

16-06-2024 12:05 AM

ఇటీవల విడుదలైన ‘హరోం హర’ సినిమాలో కథానాయికగా నటించింది మాళవిక శర్మ. సుధీర్ బాబుకు జోడీగా కనపడిన ఆమె నటనకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కుప్పం ప్రాంతానికి చెందిన గ్రామీణ యువతి పాత్ర పోషించిన ఈ ముంబై భామ, చీరకట్టులోనూ ఎంతో అందంగా కనపడ్డారు. అయితే సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా జరిపిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఆమె హాజరు కాలేదు. సినిమా విడుదల అనంతరం కూడా ఆమె ఎక్కడా కనిపించటం లేదు. దాంతో కావాలనే మాళవిక ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంటోదని గుసగుసలు మొదలయ్యాయి.

సినిమాలో ఆమె పాత్ర ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలు, ‘కనులెందుకో’ అనే పాటకే పరిమితం కావడం ఇందుకు ప్రధాన కారణమని పుకార్లు పుట్టుకొస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై స్పష్టతనిచ్చిన చిత్ర వర్గాలు అ‘లా’ ఏం కాదని అసలు విషయాన్ని చెప్పుకొచ్చాయి. ‘హరోం హర’లో అధ్యాపకురాలి పాత్రలో కనపడిన మాళవిక, వాస్తవ జీవితంలో విద్యార్థి పాత్ర పోషిస్తున్నారట. ప్రస్తుతం ‘లా’ విద్యను అభ్యసిస్తున్నారామె. దానికి సంబంధించిన పరీక్షలు జరుగుతుండటం మూలాన ఆమె సినిమా ప్రచార కార్యక్రమాలకు హాజరుకాలేకపోయారు. ‘నేల టికెట్’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన మాళవిక శర్మ, మార్చిలో విడుదలైన ‘భీమా’ సినిమాతో ఇప్పటికే ఈ ఏడాదిలో ఓసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు.