స్మారక నిర్మాణానికి అంగీకారం
* ట్రస్ట్ ఏర్పాటు తర్వాతే భూ కేటాయింపు
* ప్రకటన ద్వారా తెలియజేసిన హోంశాఖ
* మన్మోహన్ కుటుంబ సభ్యులు, ఖర్గేకు తెలిపినట్టు వివరణ
న్యూఢిల్లీ, డిసెంబర్ 28: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారక నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించడానికి కేంద్ర ప్రభత్వుం అంగీకరించింది. స్మారక నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని కోరుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నుంచి వినతి పత్రం అందినట్లు కేంద్ర హోంశాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ క్రమంలోనే క్యాబినేట్ సమావేశం తర్వాత మన్మోహన్ స్మారక నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వెల్లడించింది. అయితే మెమోరియల్ కోసం ట్రస్ట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, ఆ తర్వాతే భూ కేటాయింపు జరుగుతుందని పేర్కొంది. ఈ విషయాన్ని ఖర్గే, మన్మోహన్ కుటుంబ సభ్యులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలియజేసినట్టు వెల్లడించింది.
స్మారక స్థలంపై మాటల యుద్ధం
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలనే అంశంపై శుక్రవారం చాలాసేపు ఉత్కంఠ నడించింది. స్మారక నిర్మాణం చేపట్టడానికి వీలున్న స్థలంలోనే మన్మోహన్ అంతిమ సంస్కారాలు పూర్తిచేయాలని కాంగ్రెస్ తొలుత కొరింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ విషయంపై ప్రధాని నరేంద్రమోదీతో శుక్రవారం ఉదయం ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం లేఖ రాశారు. “మాజీ ప్రధానులు, రాజనీతిజ్ఞులకు అంత్యక్రియలు నిర్వహించిన ప్రదేశంలోనే స్మారక నిర్మాణాలు ఏర్పాటు చేయడం మన దేశంలో సంప్రదాయంగా వస్తుంది.
ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మన్మోహన్ అంత్యక్రియలకు స్థలాన్ని ఎంపిక చేయాలి” అని ప్రధాని మోదీకి రాసిన లేఖలో ఖర్గే విజ్ఞప్తి చేశారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థనపై ప్రభుత్వం మొదట చాలా సమయం వరకూ స్పందించలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థనకు విరుద్ధంగా ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. స్మారక స్థలాన్ని కేటాయించడానికి సమయం పడుతుందని తెలుపుతూ ఢిల్లీలో నిగమ్‌బోధ్‌లో అధికారిక లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు జరుగుతాయని వెల్లడించింది.
ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా అవమానించింది: జైరాం రమేశ్
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, స్మారక చిహ్నం ఏర్పాటుకు ప్రభుత్వం స్థలం ఎందుకు కేటాయించలేపోతుందో దేశ ప్రజలు కూడా అర్థం చేసుకోలేపోతున్నారు. మన్మోహన్ గ్లోబల్ ఇమేజ్, ఆయన సాధించిన అసాధారణ విజయాలు, దశాబ్దాలుగా దేశానికి అందించిన సేవలకు చిహ్నంగా స్మారకం ఉండాలి. స్మారక స్థలం కేటాయించకుండా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే మన్మోహన్‌ను అవమానించిందని కాంగ్రెస్ అగ్రనేత జైరాం రమేశ్ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.
ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయం: సుఖ్‌బీర్ సింగ్ బాదల్
ప్రభుత్వ నిర్ణయాన్ని నమ్మలేకపోతున్నాను. స్మారక చిహ్నం ఏర్పాటు చేసే స్థలంలోనే అంత్యక్రియలు నిర్వహించాలన్న మన్మోహన్ కుటుంబ సభ్యుల అభ్యర్థనను తిరస్కరించడమనేది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. దేశ ప్రధానిగా ఎదిగిన ఏకైక సిక్కు సమాజానికి చెందిన గొప్ప నాయకుడిపట్ల ప్రభుత్వం ఎందుకు ఇంత అగౌరవం ప్రవర్తిస్తుందో అర్థం కావట్లేదని శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని విమర్శించారు.
1000 గజాల స్థలాన్ని కూడా కేటాయించలేకపోయింది: కేజ్రీవాల్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, స్మారక చిహ్నం కోసం బీజేపీ 1000 గజాల స్థలాన్ని కూడా కేటాయించలేకపోయిందని ఆప్ కన్వీనర్ కేజ్రీవా ల్ విమర్శించారు.
మన్మోహన్‌కు ఎందుకు ఇవ్వరు: అమరీందర్ సింగ్
స్మారక చిహ్నం కోసం స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారకానికి స్థలం ఇచ్చినప్పుడు మన్మోహన్ సింగ్ కోసం ఎందుకు ఇవ్వలేరు. ఆయన ఏకైక సిక్కు ప్రధాని. ఆయన స్మారక చిహ్నం భావితరాలకు స్ఫూర్తినిస్తుందని కాంగ్రెస్ ఎంపీ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ ప్రభత్వుంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పుడు రాజకీయాలు సరికాదు: బీజేపీ
మన్మోహన్ స్మారక స్థలం చుట్టూ వివాదం ముదురుతున్న నేపథ్యంలో దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి సుధా న్షు త్రివేది స్పందించారు. దేశ ఆర్థికాభివృద్ధికి పునాది వేసిన మన్మోహన్ సింగ్‌కు సముచిత గౌరవం కల్పించేందుకు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభు త్వం అంకితభావంతో పని చేస్తుందన్నారు.
మన్మోహన్‌ను కాంగ్రె స్ ఏనాడూ గౌరవించలేదని ఆరోపించారు. ఈ విషాద సమయంలో రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు. మరోవైపు కాంగ్రెస్‌పై బీజేపీ నేత సీఆర్ కేశవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2004 మధ్య అధికారం లో ఉన్న కాంగ్రెస్ పార్టీ పీవీకి స్మారకం నిర్మించలేదని దుయ్యబట్టారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో ఆయనకు స్మారకం నిర్మించడంతోపాటు 2024లో భారతరత్న ప్రకటించి సముచిత గౌరవం ఇచ్చిందని గుర్తు చేశారు.






