12 July, 2026 | 7:20 PM

సర్ ప్రక్రియను ఆకస్మిక తనిఖీ చేసిన తహసీల్దార్

12-07-2026 06:33 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): మండలంలోని హనుమంతుల గూడెం గ్రామంలో 107వ బూత్ లో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని మండల తహసిల్దార్ కె.హిమ బిందు ఆదివారం ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘సర్‌’ ప్రక్రియలో భాగంగా చేపట్టిన ఎన్యూమ రేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ ప్రక్రియను పారదర్శకతో, నిర్ణిత గడువు లోగా పూర్తి చేయాలని బిఎల్ఎలను ఆదేశించారు.

ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ఈనెల 24తో ముగు స్తుందని, ఈ 12 రోజుల్లోగా బీఎల్వోలు, రెవెన్యూ అధికారులు, బూత్ లెవెల్ ఏజెంట్లు ప్రత్యేక శ్రద్ధ కనబరిచి డిజిటలైజేషన్‌ వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇతర ప్రాంతాలకు మారిపోయిన,మరణించిన ఓటర్లకు సంబంధించిన వివరాలను ప్రత్యేక జాబితాల రూపంలో సిద్ధం చేసి అందజేయాలని, జాబితాలను క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా ధృవీకరించి నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో 107 పోలింగ్ బూత్ ఇంచార్జ్ కొత్తపల్లి ప్రభాకర్,విఆర్ఎ జానీ, ఫీల్డ్ అసిస్టెంట్ సుజాత, ఆశా వర్కర్ రజిత, అంగన్వాడి టీచర్ సైదమ్మ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.