రాష్ట్ర స్థాయి ఉత్తమ సేవల పురస్కారం అందుకున్న జిల్లా వాసి
ఆదిలాబాద్,(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంత ప్రజలకు కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ) ద్వారా ప్రభుత్వ, డిజిటల్ సేవలను సమర్థవంతంగా అందిస్తూ విశిష్ట సేవలు అందించిన ఇచ్చోడకు చెందిన కొండ ప్రశాంత్ రాష్ట్ర స్థాయి ఉత్తమ సేవల పురస్కారాన్ని అందుకున్నారు. హైదరాబాద్‌లోని బిర్లా ప్లానెటోరియంలోని భాస్కర ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించిన 17వ సీఎస్సీ దివస్ వేడుకల సందర్భంగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఆయనకు ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, సీఎస్సీ రాష్ట్ర హెడ్ విఘ్నేష్ చేతుల మీదుగా కొండ ప్రశాంత్ ఈ పురస్కారాన్ని స్వీకరించారు. గ్రామీణ ప్రజలకు వివిధ ప్రభుత్వ పథకాలు, డిజిటల్ సేవలు, ఆన్‌లైన్ సౌకర్యాలను చేరువ చేస్తూ, సీఎస్సీ సేవలను సమర్థవంతంగా అమలు చేయడంలో ఆయన చూపిన కృషి, అంకితభావం, సేవా దృక్పథానికి గుర్తింపుగానే ఈ రాష్ట్ర స్థాయి అవార్డును అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ప్రజలకు సులభతరంగా సేవలు అందించాలనే లక్ష్యంతో నిరంతరం పనిచేస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సేవల విస్తరణకు కొండ ప్రశాంత్ అందిస్తున్న సేవలు ఆదర్శప్రాయమని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, సహచరులు, మిత్రులు, శ్రేయోభిలాషులు కొండ ప్రశాంత్‌ను అభినందిస్తూ, ఆయన సాధించిన ఈ ఘనత ఇచ్చోడ ప్రాంతానికే కాకుండా మొత్తం జిల్లా ప్రజలకు గర్వకారణమని అన్నారు. రాష్ట్ర స్థాయిలో లభించిన ఈ గుర్తింపు యువతకు స్ఫూర్తిదాయకమని వారు అభిప్రాయపడ్డారు.






