24 May, 2026 | 12:52 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కుట్రలు మానుకోవాలి

24-05-2026 12:00 AM

ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలి

బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, మే 23 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తేయాలనే ప్రభుత్వం చేస్తున్న కుట్రలను మానుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు.

శనివారం కాచిగూడ మహారాజ్ హోటల్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ జరిగిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి ప్రసాద్, బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు జి. అనంతయ్యల అధ్యక్షత జరిగింది. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీం పేద వర్గాలవారు ఉచితంగా విద్యనభ్యసిస్తుంటే ఉన్నతవర్గాలు, అగ్రకులాలు ఓర్వలేక పోతున్నాయని ఆరోపించారు.

విద్య అనేది రాజ్యాంగబద్ధమైన హక్కు అన్నారు. ఫీజులపై హైకోర్టు తీర్పును పాటించాలన్నారు. ఇందుకాలేజీ యాజమాన్యం ఒత్తిడి వల్లే ప్రణీత్ అనే బీటెక్ విద్యార్థి మృతి చెందాడని పేర్కొన్నారు. మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న మొత్తం ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పథకాన్ని ఎత్తివేస్తే ఎట్టి పరిస్థితిలో సహించే లేదని హెచ్చరించారు.

జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జసత్యం మాట్లాడుతూ.. బీసీలు విద్యలో రాణించకుండా ప్రభుత్వం పథకాన్ని ఎత్తివేసే కుట్రలు చేయడం సరైనది కాదన్నారు. తక్షణమే బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ సమావేశంలో పూసల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోలా శ్రీనివాస్, బీసీ జూనియర్ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జక్కుల వంశీకృష్ణ, బీజేపీ ఓబీసీ కార్యదర్శి వెంకటేష్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సి.రాజేందర్, నాయకులు నిఖిల్ పటేల్, చిక్కుడు బాలయ్య, అంజిగౌడ్, శివగౌడ్ తదితరులు పాల్గొన్నారు.