24 May, 2026 | 12:13 AM

తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి

24-05-2026 12:00 AM
  1. మోదీ 3.0 పాలనలో ఏపీ అత్యధిక లబ్ధి
  2. తెలంగాణకు 12 ఏళ్లలో 12 లక్షల కోట్లు
  3. గుంతకల్ ‘రోజ్ గార్ మేళా’లో కేంద్రమంత్రి బండి సంజయ్

హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి): కేంద్రంలోని నరేంద్రమో దీ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి, కృషిచేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. మోదీ 3.0 పాలనలో దక్షిణ భారత దేశంలో కేంద్రం నుంచి అత్యధిక ప్రయోజనాలు పొందుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు. అందులో భాగంగా గత రెండేళ్లలో రూ.3 లక్షల కోట్లకుపైగా ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు జరిగాయన్నారు.

కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండటం వల్లే ఇది సాధ్యమైందన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం సైతం మోదీ ప్రభుత్వం గత 12 ఏళ్ల లో 12 లక్షల కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు. శనివారం అనంతపురం జిల్లా గుంత కల్ రైల్వే ఆఫీసర్స్ క్లబ్ ఆడిటోరియంలో నిర్వహించిన ‘రోజ్ గార్ మేళా’ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజ య్ చేతుల మీదుగా 120 మంది అభ్యర్థులు ఉద్యోగ అపాయిట్‌మెంట్ లెటర్లను అందుకున్నారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ..తెలంగాణ ప్రజలు సైతం డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలనే భావనలో ఉన్నారని తెలిపారు. అమెరికా ఇరాన్, రష్యా ఉక్రెయిన్ యుద్దం వల్ల ప్రపంచమంతా సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. భారత్ దేశం సుస్థిరంగా ఉండాలంటే ప్రధా ని నరేంద్రమోదీ సూచించిన సప్తసూత్రాలను కచ్చితంగా పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సప్తసూత్రాలను పాటిస్తూ మీరు చేసే పొదుపు... ఈ దేశ భవితకు మలుపు కానుందని అన్నారు.

అవినీతి, పైరవీలు, దళారుల ప్రమేయం లేకుండా ఇప్పటి వరకు 11 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడం మోదీ కమిట్‌మెంట్‌కు నిదర్శనమన్నారు. 19వ విడత ద్వారా 47 ప్రాంతాల్లో రోజ్ గార్ మేళా ద్వారా మరో 51 వేల ఉద్యోగాల భర్తీ చేసి నియామక పత్రాలు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే డీఆర్‌ఎం చంద్రశేఖర్ గుప్తా, ఎడీఆర్‌ఎం శివప్రసాద్, డీపీఓ హెచ్‌ఎల్‌ఎన్ ప్రసాద్ తది తరులు పాల్గొన్నారు.