ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య
ఎల్బీనగర్ , ఆగస్టు 12 : ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం తెల్లవారుజామున 2.30 గంటలకు వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే... 2024 బ్యాచ్ కు చెందిన జె.సాయికుమార్ (13128) కర్మన్‌ఘాట్‌లో స్నేహితులతో కలిసి ఓ గదిలో నివాసం ఉంటున్నాడు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయంలోని రెస్ట్‌రూమ్‌లో బుధవారం తెల్లవారుజామున ఉరివేసుకున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఈ-కాప్స్ డ్యూటీ కోసం ఏసీపీ కార్యాలయానికి అటాచ్‌మెంట్ చేశారు. గమనించిన సిబ్బంది వెంటనే కామినేని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సాయి కుమార్ ఆత్మహత్యపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్బీనగర్ సీఐ వినోద్ కుమార్ తెలిపారు.






