12 August, 2026 | 11:04 AM

అటవీ అధికారిని బలి తీసుకున్న విద్యుత్‌ ఉచ్చు

12-08-2026 10:02 AM

వేటగాళ్లు అమర్చిన కరెంట్‌ తీగలకు ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ మృతి

నకిరిపేట సమీపంలో విషాద ఘటన.. దర్యాప్తు ముమ్మరం

బూర్గంపాడు,(విజయక్రాంతి): అడవి జంతువుల వేట కోసం గుర్తుతెలియని వ్యక్తులు అమర్చిన విద్యుత్‌ తీగలు ఓ అటవీ శాఖ అధికారిని బలిగొన్నాయి. బూర్గంపాడు మండలం నకిరేపేట గ్రామ సమీపంలోని చెరువు సింగారం వెస్ట్‌ బీట్‌ పరిధిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.అటవీ శాఖలో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న నవీన్‌ మంగళవారం విధుల్లో భాగంగా అటవీ ప్రాంతానికి వెళ్లిన సమయంలో విద్యుత్‌ ఉచ్చులో ప్రమాదవశాత్తు చిక్కుకున్నట్లు సమాచారం. దీంతో తీవ్ర విద్యుదాఘాతానికి గురైన ఆయనను సహచరులు, స్థానికుల సహాయంతో 108 అంబులెన్స్‌లో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించినట్లు తెలిసింది.

వేట కోసం విద్యుత్‌ ఉచ్చు?

అడవి జంతువులను వేటాడేందుకు గుర్తుతెలియని వ్యక్తులు విద్యుత్‌ తీగలను అమర్చినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే ఈ తీగలను ఎవరు ఏర్పాటు చేశారు? ఏ జంతువుల వేట కోసం అమర్చారు? ఎప్పటి నుంచి అక్కడ ఉన్నాయి? అనే అంశాలు ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది.

పూర్తి స్థాయి దర్యాప్తు

ఘటనపై అటవీ, పోలీస్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. ఘటనాస్థలాన్ని పరిశీలించి విద్యుత్‌ ఉచ్చు ఏర్పాటుకు కారణాలు, బాధ్యులెవరు, అధికారికి ప్రమాదం ఏ పరిస్థితుల్లో జరిగిందనే అంశాలపై దర్యాప్తు చేపట్టారు. ఘటనలో మరెవరైనా ప్రమేయం ఉందా? అన్న కోణంలోనూ విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం.