విద్య ద్వారా ప్రయోజకులు కావాలి
వనవాసీ విద్యార్థులకు కానిస్టేబుల్ ప్రసాద్ ఉద్బోధ
చర్ల,(విజయక్రాంతి): విద్య ద్వారా ఉన్నత లక్ష్యాలను సాధించాలని, చిన్ననాటి నుండే స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగాలని ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ వేమాల ప్రసాద్ వనవాసీ విద్యార్థులకు ఉద్బోధించారు. చర్లలోని వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం నిలయంలో ప్రసాద్ - సునీత దంపతుల ద్వితీయ కుమారుడు నిహాల్ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఒక జత దుస్తులు, కంబాక్స్‌లు, పెన్నులు, పెన్సిళ్లు, పండ్లను అందజేశారు.
కొమరం భీం నిలయ కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రసాద్ మాట్లాడుతూ "ప్రతి విద్యార్థి చదువుపై దృష్టి సారించి ఉన్నత స్థితికి చేరుకోవాలి. మనం ఏమి కావాలో ముందుగానే నిర్ణయించుకొని కష్టపడితే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చన్నారు. విద్యతోనే వినయం, విధేయత వస్తాయని, కుటుంబంలో ఒక్కరు చదివి స్థిరపడితే ఆ కుటుంబం మొత్తం అభివృద్ధి చెందుతుందని అన్నారు. గిరిజన విద్యార్థుల సంక్షేమానికి దాతలు తమవంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహ కార్యదర్శి గోగికార్ రాంలక్ష్మణ్, జిల్లా సంఘటనా సహ కార్యదర్శి గొంది శోభన్ బాబు పాల్గొన్నారు.






