26 June, 2026 | 8:42 PM

జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎమ్మెల్యే పాయం

26-06-2026 07:20 PM

అశ్వాపురం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని డీవీ గ్రాండ్‌లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (ఐజేయు) ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి జర్నలిస్టుల సమావేశంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. విధి నిర్వహణలో లేదా ఇతర కారణాలతో జర్నలిస్టులు మరణించిన సందర్భాల్లో వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా అందజేస్తోందని, ప్రమాదాలకు గురైన జర్నలిస్టులకు కూడా అవసరమైన సహాయ సహకారాలు అందేలా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.

అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియలో కొంత ఆలస్యం జరిగినప్పటికీ అర్హులైన ప్రతి జర్నలిస్టుకు పారదర్శకంగా అక్రిడిటేషన్ కార్డులు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర సమాచార, ప్రజాసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, గృహ వసతి వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం పొందేలా హెల్త్ కార్డుల సౌకర్యాన్ని జర్నలిస్టులకు విస్తరించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, విలేఖరులు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని కోరారు.