జలసిరి నిధులతో ఇంకుడు గుంతల నిర్మాణాలకు శ్రీకారం
ఇరక్పల్లి, కుభతాండలో ఎంపీడీవో మహేశ్వరరావు ప్రారంభం
నాగల్గిద్ద, జూలై 29: వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన వీబీజీరామ్జీ కార్యక్రమంలో భాగంగా జలసిరి నిధులతో నాగల్గిద్ద మండలంలోని ఇరక్పల్లి, కుభ తాండ గ్రామ పంచాయతీలలో ఇంకుడు గుంతల నిర్మాణ పనులకు బుధవారం ఎంపీడీవో మహేశ్వరరావు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో మహేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి వద్ద తప్పనిసరిగా ఒక ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. అలాగే గ్రామంలోని బోర్వెల్ మోటార్ల వద్ద, వర్షపు నీరు అత్యధికంగా చేరే ప్రాంతాల్లో పెద్ద పరిమాణంలో సామూహిక ఇంకుడు గుంతలను నిర్మించాలని తెలిపారు. ఇలా చేయడం వల్ల వర్షపు నీరు వృథా కాకుండా భూమిలోకి ఇంకి భూగర్భ జలాల మట్టం గణనీయంగా పెరుగుతుందని వివరించారు.
ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం జలసిరి నిధుల ద్వారా ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుందని తెలిపారు. సుమారు రూ.2 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఎంపీడీవో ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇరక్పల్లి సర్పంచ్ శాంతప్ప, కుభ తాండ సర్పంచ్ రాజు, గ్రామ కార్యదర్శులు గీతా, విజయలక్ష్మి, టెక్నికల్ అసిస్టెంట్ సోనేష్, ఈసీ సుధాకర్, ఫీల్ అసిస్టెంట్ శివాజీ, ఉపసర్పంచ్ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.






