గ్యాస్ సిలిం‘డర్’.!?
నిద్రాహారాలు మాని నిరీక్షణ
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా నరసింహుల పేటలో గ్యాస్ సిలిండర్ల కొరత వినియోగదారులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. స్థానిక భారత్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల అలసత్వం, నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా తమకు గ్యాస్ సిలిండర్లు సక్రమంగా సరఫరా చేయడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. రెండు నెలలుగా గ్యాస్ సిలిండర్ల కొరత వినియోగదారులను ఇబ్బందులు పెడుతున్నప్పటికీ పట్టించుకునే నాధుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆదివారం ఉదయం గోదాముకు గ్యాస్ సిలిండర్లు దిగుమతి అవుతాయని తెలుసుకున్న వినియోగదారులు వందలాది సంఖ్యలో శనివారం రాత్రి నుండి ఖాళీ సిలిండర్లతో గోదాం వద్ద నిద్రాహారాలు మాని పడిగాపులు కాస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం వరకు కూడా గ్యాస్ సిలిండర్లు గోదాముకు రాకపోవడంతో వినియోగదారులు పెద్ద సంఖ్యలో అక్కడే వాడిగాపులు పడుతున్నారు. ఈ విషయంపై ఎవరూ పెద్దగా స్పందించడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.






