12 March, 2026 | 3:45 AM

ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం

12-03-2026 01:58 AM

ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీ నుంచి పోటీ చేసినా ఉల్లంఘన కాదా?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు దుయ్యబట్టారు. ఒక వ్యక్తి ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, ఆరు నెలలలోపే మరో పార్టీలో చేరి అదే పార్టీ తరఫున లోక్‌సభకు పోటీ చేయడమనేది రాష్ట్ర ప్రజలు చూసిన విషయమేనని, ఇంత స్పష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ దానిని పార్టీ ఫిరాయింపుగా పరిగణించలేమని చెప్పడం ఆశ్చర్యంగా ఉన్నదని పేర్కొన్నారు.

బుధవారం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడారు. ఒక పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి మరో పార్టీ అభ్యర్థికి ప్రచారం చేయడం, అదే పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయడం వంటి స్పష్టమైన రికార్డులు ఉన్నప్పటికీ కూడా ఇది పార్టీ ఫిరాయింపు కాదని చెప్పడం ప్రజాస్వామ్యాన్ని అవమానించే తీర్పు అని, ఇది ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా అగౌరవపరిచినట్టేనని వెల్లడించారు. యాంటీ డిఫెక్షన్ చట్టాన్ని తీసుకొచ్చింది రాజీవ్‌గాంధీయేనని, ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీయే ఫిరాయింపులపైన ఈ విధంగా వ్యవహరించడం దారుణమని, దీనిపై రాహుల్‌గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో యాంటీ డిఫెక్షన్ చట్టం స్పష్టంగా ఉల్లంఘనకు గురవుతున్న పరిస్థితుల్లో స్పీకర్ ఇలాంటి తీర్పు ఇవ్వడం రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కడమే ఆందోళన వ్యక్తంచేశారు. రాహుల్‌గాంధీ ఒకవైపు రాజ్యాంగాన్ని కాపాడుతున్నామని చెప్పుకుంటూ తిరుగుతున్నారని, మరోవైపు ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఇలాంటి తీర్పులు రావడం ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. ఈ రోజు వచ్చిన తీర్పు కేవలం ప్రజాస్వామ్యాన్ని మాత్రమే కాదు, రాజ్యాంగాన్ని, ప్రజల తీర్పును కూడా అగౌరవపర్చడమే, అవమానించడమేనని, ఈ తీర్పుపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోందని పేర్కొన్నారు.