21 May, 2026 | 2:41 AM

ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియకు రాజకీయ పార్టీల సహకారం అవసరం

21-05-2026 12:00 AM

జిల్లా కలెక్టర్ అంకిత్

భద్రాద్రి కొత్తగూడెం/ఇల్లెందు, మే ౨౦ (విజయక్రాంతి): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) మ్యాపింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు.

బుధవారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టనున్న ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను పారదర్శకంగా, ఖచ్చితంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు తమ బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితాలను వెంటనే సమర్పించాలని సూచించారు.

బీఎల్వోలు నిర్వహించే ఇంటింటి సర్వే కార్యక్రమానికి రాజకీయ పార్టీల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. జూన్ 2026 నుండి బీఎల్వోలు ఇంటింటి సర్వే నిర్వహించి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తారని, ప్రతి ఓటరు ఇంటిని కనీసం ఒక్కసారైనా సందర్శించి అవసరమైతే మూడు సార్లు వరకు వెళ్లి ఫారాలు సేకరిస్తారని చెప్పారు. ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ ప్రక్రియ జూన్ 26 నుండి ప్రారంభమై 24-07-2026 లోపు పూర్తవుతుందని తెలిపారు.

అనంతరం 31-07-2026న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించి, 31-07-2026 నుండి 30-08-2026 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్పారు. 01-10-2026న తుది ఓటరు జాబితా ప్రచురణ ఉంటుందని తెలిపారు. చిరునామా మార్పులు, ఇతర సవరణల కోసం ఫారం-8 ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. ఓటర్లు తమ పేరు ఎస్‌ఐఆర్-2002 జాబితాలో ఉందో లేదో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి అధికారిక వ్బుసైట్ లేదా ఈసీఐ ఓటర్స్ పోర్టల్లో సెర్చ్ బై ఎలెక్టర్ డిటైల్స్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు.

ఆధార్ నంబర్ ఇవ్వడం పూర్తిగా ఐచ్చికమని స్పష్టం చేశారు. 18 సంవత్సరాలు పూర్తిచేసుకున్న వారు ఫారం-6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవచ్చని, 01 అక్టోబర్ 2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకునే వారికీ అవకాశం ఉంటుందని తెలిపారు. ఫారం నింపడంలో లేదా వివరాల ధృవీకరణలో సహాయం కోసం బీఎల్వోలు, 1950 హెల్ప్లైన్, ఈసీఐ ఓటర్స్ పోర్టల్ మరియు బుక్ ఏ కాల్ విత్ బీఎల్వో సౌకర్యాలను వినియోగించుకోవచ్చని సూచించారు. విదేశాల్లో లేదా ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగం చేస్తున్న ఓటర్ల తరపున కుటుంబంలోని పెద్ద సభ్యుడు ఫారం నింపి బీఎల్వోకు సమర్పించవచ్చని తెలిపారు.

అనంతరం జిల్లా ఎన్నికల మాస్టర్ ట్రైనర్ పూసపాటి సాయి కృష్ణ ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రాముఖ్యత, ఫారాల నింపే విధానంపై రాజకీయ పార్టీ ప్రతినిధులకు అవగాహన కల్పించారు. ఎన్నికల సూపరింటెండెంట్ రంగ ప్రసాద్, జిల్లా ఎన్నికల మాస్టర్ ట్రైనర్ పూసపాటి సాయి కృష్ణ, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి రాంబాబు, భారతీయ జనతా పార్టీ ప్రతినిధి ప్రభాకర్ రెడ్డి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి దేవి ప్రసన్న, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ప్రతినిధి కంచర్ల జమలయ్య, ఎన్నిక సిబ్బంది నవీన్ పాల్గొన్నారు.