06-12-2025 11:13:33 PM
* మంత్రి పొన్నం ప్రభాకర్..
* పార్టీ నాయకులతో సమన్వయ సమావేశం..
హుస్నాబాద్: పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులే సర్పంచులుగా గెలవాలనే లక్ష్యంతో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యూహరచన చేపట్టారు. ఈ మేరకు ఆయన శనివారం సాయంత్రం హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని తన కార్యాలయంలో మండలాల వారీగా పార్టీ ముఖ్య నాయకులతో ప్రత్యేక సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. గ్రామ స్థాయి నుంచి ప్రచార బలం పెంచి, పార్టీ మద్దతుదారులను ఏకతాటిపైకి తెచ్చి, ప్రతి గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్‌ను గెలిపించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.
"సర్పంచులుగా మనోళ్లే గెలవాలి. నియోజకవర్గంలో 100 శాతం విజయాన్ని లక్ష్యంగా పెట్టుకొని పనిచేయాలి" అని నాయకులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ బలపర్చిన అభ్యర్థి గెలుపు కోసం అన్ని వర్గాల నాయకులు ఐక్యంగా నిలబడి ప్రచారం చేయాలని, గ్రామాల్లో ప్రత్యర్థుల బలాన్ని గమనిస్తూ వ్యూహాత్మకంగా పని చేయాలని సూచించారు. మండలాల వారీగా ఓటర్లతో నేరుగా మమేకం, ఇంటింటికీ చేరే ప్రచారం, అభ్యర్థుల బలహీనతలు–బలం విశ్లేషణ, గెలుపునకు అవసరమైన కృషి కీలకమని మంత్రి అన్నారు.