యాకుత్‌పురాలో బాణసంచా పేలుడు: దంపతులు మృతి
హైదరాబాద్: నగరంలోని యాకుత్‌పురాలోని రెయిన్‌బజార్‌లోని ఓ ఇంట్లో సోమవారం రాత్రి బాణసంచా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో వృద్ధ దంపతులు మృతి చెందారు. బాణసంచా పేలి కుమారై (18)కు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దంపతులు యాకుత్ పురాలో బాణసంచా దుకాణం నిర్వహిస్తున్నారు. నిన్న రాత్రి దుకాణం నుంచి బాణసంచాను దంపతులు ఇంటికి తీసుకెళ్లారు. ఇంట్లో పిండివంటలు తయారు చేస్తుండగా నిప్పురవ్వలు ఎగిసిపడి ప్రమాదం సంభవించింది. మృతులను హీరా మోహన్ లాల్, అతని భార్య ఉషా రాణిగా గుర్తించారు. పండగ పూట ఈ ఘటన జరగడంతో వారి కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పాన్‌లోని ఎడిబుల్ ఆయిల్ ఎక్కువ వేడెక్కడంతో మంటలు ఇంట్లోకి వ్యాపించాయి. దీపావళికి ఇంట్లో నిల్వ ఉంచిన కొన్ని క్రాకర్లు కూడా మంటల కారణంగా పగిలిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మోహన్, ఉష, శృతిలను రక్షించారు. వారిని ఆసుపత్రికి తరలించగా, దంపతులు - మోహన్, ఉష మరణించినట్లు ప్రకటించారు. పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా పక్క భవనాల్లోని ప్రజలను ఖాళీ చేయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో బాణసంచా నెర్వలు ఉంచుకోవద్దని వ్యాపారులకు పోలీసులు సూచించారు.




