బాణసంచా పేలుడు.. 154 మందికి గాయాలు
తిరువనంతపురం: కేరళలోని కాసర్‌గోడ్‌లోని నీలేశ్వరం సమీపంలో సోమవారం అర్థరాత్రి ఆలయ ఉత్సవం సందర్భంగా జరిగిన బాణాసంచా ప్రమాదంలో 154 మందికి పైగా గాయపడ్డారు. వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను కాసర్‌గోడ్, కన్నూర్, మంగళూరులోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. వీరర్కావు దేవాలయం సమీపంలోని బాణసంచా నిల్వ కేంద్రంలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలానికి కలెక్టర్, జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సహా జిల్లా పాలనా యంత్రాంగం ఉన్నతాధికారులు చేరుకున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో గుమిగూడిన ప్రజలు పరిగెత్తడంతో క్రాకర్లు పేలి భారీ మంటలు చేలరేగాయి. దట్టమైన పొగ మేఘాలు కమ్మేసినట్లు స్పాట్ నుండి షాకింగ్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.




