12 May, 2026 | 2:58 AM

దంపతుల ఆత్మహత్య

12-05-2026 01:41 AM
  1. పుట్టింట్లో ఉరేసుకున్న భార్య
  2. తట్టుకోలేక తానూ ఉరేసుకున్న భర్త 
  3. కొన్ని రోజుల క్రితమే పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి 
  4. సిద్దిపేట జిల్లాలో ఘటన

కొండపాక, మే 11: ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న దంపతులు నెల రోజులు కూడా గడవకముందే ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రానికి చెందిన దేశెట్టి వినయ్, కొండపాక మండలానికి చెందిన అంజలి కొంతకాలంగా ప్రేమించుకొని ఇటీవలే ఇరు కుటుంబ సభ్యుల సమ్మతితో వివాహం చేసుకున్నారు.

అయితే పెళ్లై నెల రోజులు కూడా పూర్తికాకముందే ఈ దారుణం చోటుచేసుకోవడం అందరినీ విషాదంలో ముంచెత్తింది. అంజలిని తన అమ్మగారి ఇంట్లో విడిచి వినయ్ ఉపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లాడు. కాగా ఆదివారం అంజలి భర్త ఫోన్ చేయగా ఆలస్యంగా స్పందించడంతో భర్త మందలించాడు. మనస్థాపం చెందిన భార్య పుట్టింట్లోనే ఉరేసుకుని చనిపోయింది. ఆత్మహత్యకు ముందు భర్త వినయ్‌కు ఫోన్ చేసి తాను చనిపోతున్నాను అని చెప్పినట్లు సమాచారం.

భార్య మృతి తెలుసుకుని హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వస్తున్న వినయ్.. ఆమె మృతిని తట్టుకోలేక రాయారం గ్రామ శివారులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వినయ్ ఉరేసుకునే ముందు తండ్రికి లొకేషన్ పెట్టడంతో పాటు మిత్రులకు సమాచారం అందించాడు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.