2 August, 2026 | 3:21 PM

కోవాగ్జిన్ ట్రయల్ ఫలితాలు విడుదల చేయాలి

23-05-2024 07:00 AM

పరిశోధనల సెన్సార్‌షిప్‌కు ఐసీఎంఆర్ దూరంగా ఉండాలి

యూహెచ్‌ఓ వైద్యుల బృందం డిమాండ్

హైదరాబాద్, మే 22: అకాడమిక్ సెన్సార్‌షిప్ నుంచి దూరంగా ఉండాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)కు ప్రజారోగ్య బృందానికి చెందిన వైద్యులు, నిపుణులు లేఖ రాశారు. కోవాగ్జిన్‌పై అధ్యయనం చేసిన బనారస్ హిందూ విశ్వవిద్యాలయం పరిశోధకులపై ఐసీఎంఆర్ ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని ఈ బృందం ఖండించింది. అందుకు బదులుగా టీకా నాణ్యత, దీర్ఘకాలిక ప్రభావా లపై దృష్టి పెట్టాలని సూచించింది. కోవాగ్జిన్ దీర్ఘకాలిక భద్రత విషయంలో ఇప్పటికే తక్కువ స్థాయిలో అధ్యయనాలు జరిగాయి. వీటి నుంచి ఐసీఎంఆర్ సెన్సార్‌షిప్‌కు దూరం గా ఉండాలి. ఈ టీకా వేసుకున్న కోట్లాది మంది చిన్న పిల్లల విషయంలో ఐసీఎంఆర్ అప్రమత్తంగా ఉండాలి. 

చిన్నారులకు ఎంతో భవిష్యత్తు ఉంది అని ముంబైకి చెందిన యూనివర్సల్ హెల్త్ ఆర్గనైజేషన్ (యూహెచ్‌ఓ) తన లేఖలో పేర్కొంది. ఐసీఎంఆర్ వంటి ప్రఖ్యాత సంస్థ టీకా భద్రతా ప్రమాణాలను పెంచేందుకు అధ్యయనాన్ని చేపట్టి లోపాలను పరిష్కరిస్తుందని ఆశిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. కానీ, అధ్యయనం చేసిన వారిపై ఇలాంటి బెదిరింపులకు దిగుతుందని ఊహించలేద న్నారు. టీకా భద్రతకు తగిన ప్రాధాన్యమిచ్చి ఫేజ్ ట్రయల్ ఫలితాలను ప్రచురించాలని డిమాండ్ చేశారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ పరిశోధకులు చేసిన అధ్యయనంలో కోవాగ్జిన్ తీసుకున్న మూడింట ఒక వంతు మందిలో కొన్ని ప్రతికూల ప్రభావం చూపినట్లు గుర్తించారు. 

కానీ, ఈ అధ్యయనంలో ఐసీఎంఆర్ పేరును తొలగించాలని ఆ సంస్థకు చెందిన డాక్టర్ రాజీవ్ డిమాండ్ చేశారు. ఈ అధ్యయనంలో సరైన విధానాలను పాటించ లేదని ఆరోపించారు. ఈ పరిశోధనలో వ్యాక్సిన్ వేసుకోని వారిని పరిగణించలేదని, వారు చెప్పిన ప్రతికూల ప్రభావాలు టీకా వల్ల కలగలేదని అన్నారు.