25 ఏళ్ల వరకు నో లెసెన్స్
పుణె బాలుడి డ్రైవింగ్ కేసులో రవాణా శాఖ నిర్ణయం
రెండు బార్లలో స్నేహితులతో కలసి మందుతాగిన మైనర్
90 నిమిషాల్లోనే రూ.48 వేలు ఖర్చు చేసినట్టు గుర్తింపు
అరెస్టును తప్పించుకునేందుకు బాలుడి తండ్రి ప్రయత్నం
ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన వైనం
న్యూఢిల్లీ, మే 22: పుణెలో మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల మృతికి కారణమైన 17 ఏళ్ల బాలుడి విషయంలో మహారాష్ట్ర రవాణాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బాలుడికి 25 ఏళ్లు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేయకూడదని నిర్ణయించింది. అతడు నడిపిన ఖరీదైన పోర్షే కారుకు శాశ్వత రిజిస్ట్రేషన్ లేకపోవడంతో.. ఏ ఆర్టీవో కార్యాలయంలోనూ ఏడాది పాటు రిజిస్ట్రేషన్ చేయకుండా నిషేధం విధించింది.
మార్చి నుంచి కారు పర్మినెంట్ ఫీజు రూ.1,758 పెండింగ్‌లో ఉందని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ వివేక్ భీమాన్వర్ తెలిపారు. కాగా, ప్రమాదానికి ముందు ఆ మైనర్ బాలుడు తన స్నేహితులతో కలిసి రెండు బార్లకు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. తొలుత వెళ్లిన బార్‌లో 90 నిమిషాల్లోనే రూ.48 వేలు ఖర్చు పెట్టినట్టు దర్యాప్తులో తేలింది. అక్కడి నుంచి మరో బార్‌కు వెళ్లి అక్కడ కూడా మద్యం తాగినట్టు పోలీసులు గుర్తించారు. అనంతరం తిరిగి ఇంటికి వెళ్తుండగా ఆ మైనర్ బాలుడు బైక్‌ను ఢీ కొట్టాడు. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
కార్లు మార్చి పారిపోయే యత్నం
ఈ కేసులో టీనేజర్ తండ్రి విశాల్ అగర్వాల్ పుణెలో పేరున్న రియల్టర్. బాలుడికి కారు ఇచ్చినందుకు తండ్రిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన వెంటనే తనను అరెస్టు చేస్తారని ఊహించి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. పోలీసులను ఏమార్చేందుకు మంగళవారం ఒక కారులో ముంబై బయల్దేరి, తనకు చెందిన మరో కారును డ్రైవర్‌తో గోవాకు పంపించాడు. ముంబై రోడ్డుపై ప్రయాణిస్తూ మధ్యలోనే కారు దిగిన నిందితుడు, తన స్నేహితుడి కారులో ఛత్రపతి శంభాజీనగర్ బయల్దేరాడు. నంబర్‌ను ట్రాక్ చేయకుండా ఉండేందుకు కొత్త సిమ్ కార్డు ఉపయోగించాడు. రియల్టర్ తన స్నేహితుడి కారులో వెళ్తున్నాడన్న సమాచారం అందుకున్న పోలీసులు ఆ కారుకు ఉన్న జీపీఎస్ ద్వారా ట్రాక్ చేశారు. అతడు శంభాజీనగర్ చేరుకున్నాక అరెస్టు చేశారు. బుధవారం అతడిని కోర్టులో హాజరుపరచగా, మే 24 వరకు పోలీసు కస్టడీ విధించింది.
మైనర్ బెయిల్ రద్దు
ఈ కేసులో ప్రధాన నిందితుడైన మైనర్‌కు మంజూరు చేసిన బెయిల్‌ను జువైనెల్ జస్టిస్ రద్దు చేసింది. జూన్ ౫ వరకు అతడిని రిమాండ్‌కు పంపింది. ప్రజల్లో వస్తున్న తీవ్ర ఆగ్రహం నేపథ్యంలో అతడికి ప్రాణహాని ఉందని అందుకే అతడిని రిమాండ్‌కు పంపినట్టు అతడి తరఫు న్యాయవాది చెబుతున్నారు. కాగా, యాక్సిడెంట్ చేసిన ౧౫ గంటల్లోనే మైనర్‌కు బెయిలివ్వడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైన విషయం తెలిసిందే.






