వీబీ జీ రామ్ జీకి 25,863 కోట్లు
న్యూఢిల్లీ, జూలై 5: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన గ్రామీణ ఉపాధి పథకం ‘వికసిత్ భారత్ రోజ్‌గార్, అజీవికా మిషన్ గ్రామీణ్ (వీబీ జీ రామ్ జీ) అమలు కోసం రాష్ట్రాలకు రూ. 25,863 కోట్లను తొలివిడతగా విడుదల చేసింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పథకం అమలును సమీక్షించి తొలివిడత నిధులను విడుదల చేశారు.
ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్రమంత్రి చౌహాన్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వంలో జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా అమలు చేయాల్సిన బాధ్యత అన్ని రాష్ట్రాల మంత్రులపై ఉందన్నారు. ఈ పథకంలో ఇప్పటివరకు ఎలాంటి సాంకేతిక, కార్యాచరణ సమస్యలు తలెత్తలేదన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారికి ఉపాధి కల్పించడం, సకాలంలో వేతనాలు చెల్లించడం, పేద కార్మికులను ఆదుకోవడమే కేంద్రం లక్ష్యమన్నారు.
ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు మూడేళ్లు పట్టగా, వీబీ జీ రామ్ జీ అమలు కేవలం ఒక్కరోజులోనే చేశామని సంతోషం వ్యక్తం చేశారు. ప్రారంభమైన తొలిరోజే ఆంధ్రప్రదేశ్, కేరళ, రాజస్థాన్‌లు గణనీయమైన ఉపాధి అవకాశాలు కల్పించడాన్ని చౌహాన్ ప్రశంసించారు. మిగిలిన రాష్ట్రాల గ్రామపంచాయితీల్లో కూడా వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని కోరారు. ఒడిశా, పశ్చిమ బంగాల్, జార్ఖండ్ సహా ఇతర ఆర్బీఐ ఖాతాలు, విధానపరమైన లాంఛనాలను త్వరలో పూర్తి చేసి లబ్ధి పొందాలన్నారు.
కొత్తపథకం కింద 10 శాతం వేతనాలను పెంచినట్లు తెలిపారు. ఇకపై ఏ రాష్ట్రంలోనూ రోజువారీ వేతనం రూ. 300 కంటే తక్కువగా ఉందన్నారు. కాగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా కింద వచ్చే నిధులను ఎప్పటికప్పుడు సకాలంలో విడుదల చేయాలని మంత్రిని కోరారు. అవకతవకలకు తావు లేకుండా, పారదర్శకత ద్వారా ఉపాధి కల్పించే రాష్ట్రాలకు నిధులను నిరంతరం అందజేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి చౌహాన్ స్పష్టం చేశారు.






