2 June, 2026 | 1:16 AM

భీమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ..

02-06-2026 12:36 AM

వేములవాడ, జూన్ 1,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకోవడంతో విద్యార్థులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి తరలివచ్చారు.ఉదయం నుంచే భక్తులు తలనీలాలు సమర్పించి, కోడె మొక్కులు చెల్లించుకున్నారు.

రుద్రాభిషేకం, అన్నపూజ, నిత్య చండీహోమం, నిత్య కల్యాణం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, లింగార్చన, ఆకుల పూజ తదితర విశేష పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ ఈఓ రమాదేవి ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఉచిత, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనంతో పాటు కోడె మొక్కుల క్యూలైన్ల వద్ద ఏర్పాట్లను పరిశీలించి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, క్యూలైన్లు, ఇతర సౌకర్యాలపై అధికారులకు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కోడెలకు దారాలతో అల్లిన దండలు వేయరాదని, కొబ్బరికాయలను ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్థలంలోనే కొట్టాలని భక్తులకు సూచించారు. దీంతో పరిశుభ్రతతో పాటు ఇతర భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉంటుందని తెలిపారు. వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకొని చేపట్టిన ప్రత్యేక ఏర్పాట్లను కూడా ఈఓ పరిశీలించారు. ఆలయ అధికారులు, సిబ్బంది సమన్వయంతో భక్తులు ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు.