అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు
చెన్నూర్, జూన్ 1: అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చెప్పారు. సోమవారం మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రాజారం, కొత్తపల్లి, మండల కేంద్రమైన కోటపల్లిలో గ్రామాల్లో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం ద్వారా నిర్మించిన ఇళ్లను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి ప్రారంభించారు. మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ పేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ సొంతింటి కల నెరవేరినప్పుడు కుటుంబాల్లో కనిపించే ఆనందమే మాకు సంతోషాన్ని ఇస్తుందనీ, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్నారు. ఈ సందర్భంగా కోటపల్లిలో లబ్దిదారులు మంత్రిని, ఎంపిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.






