2 June, 2026 | 1:08 AM

వక్ఫ్ బోర్డు భూముల్లో అక్రమ లే అవుట్

02-06-2026 12:36 AM

బేల,జూన్ 1 (విజయక్రాంతి): మండల కేంద్రంలో గల వక్ఫ్ బోర్డు భూమి సర్వే నెంబర్ 45,46లో అక్రమ లే అవుట్ వేస్తున్నారని జామ మసీద్ అధ్యక్షులు షకీల్ ఖాన్ కమిటీ సభ్యులతో కలిసి స్థానిక తహసీల్దార్ కు పిర్యాదు చేశారు.

మండల కేంద్రంలో గల వక్ఫ్ బోర్డు కు సంబందించిన భూమి గత కొన్ని సంవత్సరాలనుండి హై కోర్టు లో కేసు పెండింగ్ లో ఉన్నందున అక్రమ లే అవుట్ కోసం తహసీల్దార్ కార్యాలయం ఎలాంటి విచారణ చేపట్టకుండా అక్రమ లే అవుట్ కోసం నాలా అనుమతి ఇవ్వడం పట్ల వెంటనే రద్దు చేయాలనీ జామ మసీద్ కమిటీ సభ్యులు తహసీల్దార్ కి వినతిపత్రం ఇచ్చారు.

ఈ సందర్బంగా జామ మసీద్ అధ్యక్షులు షకీల్ ఖాన్ మీడియా తో మాట్లాడుతూ మండల కేంద్రంలో సర్వే నంబర్ 45,46లో దాదాపుగా 15ఎకరాల వక్ఫ్ బోర్డు భూమి గత కొన్ని సంవత్సరాల నుండి హై కోర్టు లో కేసు వివాదంలో ఉన్నందున కొందరు వ్యక్తులు కావాలని అందులో అక్రమ లే అవుట్ వేసి తమ జేబులు నింపుకోవాలని చూస్తున్నారని, వెంటనే అక్రమ లే అవుట్ రద్దు చేసి నాలా అనుమతి ని నిలిపివేయాలని స్థానిక తహసీల్దార్ ని ఈ రోజు కోరడం జరిగిందన్నారు.

సానుకూలంగా స్పందించిన తహసీల్దార్ వక్ఫ్ బోర్డు భూమి వివాదం తన దృష్టి కి రాలేదని అలాంటి భూమి లో లే అవుట్ కోసం ఇచ్చినా నాలా అనుమతిని రద్దు చేస్తామని హామీ ఇవ్వడం పట్ల వారికీ ధన్యవాదాలు తెలిపారు.వక్ఫ్ బోర్డు భూమి వివాదం లో ఉన్నందున స్థానికులు ఎవ్వరు కూడా అందులో ప్లాట్లు కొనుగోలు చేయరాదని ఈ సందర్బంగా కోరారు.