16 July, 2026 | 9:30 PM

కమలం సారథి ఎవరు?

03-07-2024 03:23 AM
  • రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి నియామకంపై అధిష్ఠానం తాత్సారం 
  • కేంద్ర మంత్రి పదవీ భారమే సరిపోతుందంటున్న కిషన్‌రెడ్డి 
  • కొత్త అధ్యక్షుడి నియామకం ఆలస్యంపై శ్రేణుల్లో అయోమయం 

హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): ఎంపీ ఎన్నికల్లో రాష్ట్రంలో ౮ సీట్లను కైవసం చేసుకొని జోష్ మీదున్న కమలం పార్టీలో కొత్త అధ్యక్షుడి నియామకంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కేంద్ర మం త్రిగా కిషన్‌రెడ్డి మరోసారి బాధ్యతలు స్వీకరించడంతో అధ్యక్ష బాధ్యతలపై ఆయన ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని ప్రచారం జరిగి నెల రోజులు గడుస్తున్నా ఆ పార్టీ అధిష్ఠానం నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. అసలు రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడిని ఎప్పుడు నియమిస్తారనే అంశంపై ఆ పార్టీ నేతలే అయోమయానికి గురవుతున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నిక లు జరగనున్న తరుణంలో అధ్యక్ష నియామకం ఎంత ఆలస్యం చేస్తే పార్టీకి అంత నష్టం అని పార్టీలోని పలువురు నేతలు చర్చించుకుంటున్నారు. 

కేంద్ర మంత్రి పదవితోనే సరిపోతుందన్నా..

గతంలో ఎప్పుడూ లేనివిధంగా రాష్ట్రంలో 8 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ ఘన విజయం సాధించి సత్తా చాటింది. అధికార కాంగ్రెస్ పార్టీకి దీటుగా గెలుపు బావుటా ఎగురవేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో 8 సీట్లను జనసేనకు కేటాయించి మిగిలిన 111 స్థానాల్లో పోటీ చేసి కేవలం ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలకే పరిమితం అయ్యింది బీజేపీ. అప్పటి వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఓవర్ టేక్ చేసి ప్రతిపక్ష పాత్రలో ఒదిగిన బీజేపీకి అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధ్యక్ష మార్పు దెబ్బ కొట్టిందని విశ్లేషకులు అంచనావేశారు. అయితే, కేవలం 6 నెలల్లోనే పార్టీ గ్రాఫ్ పెరిగిపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఊహించని విధంగా ఎంపీ సీట్లు సాధించింది.

రాష్ట్రంలో 8 మంది ఎంపీల్లో ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు సైతం దక్కాయి. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మరోసారి కేంద్రంలో కీలకమైన క్యాబినెట్ పోస్టు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన మనసులోని మాట బయట పెట్టారు. కేంద్ర మంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా జోడెద్దుల బండి ప్రయాణం కష్టమవుతున్నదని గత నెల 22న పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్‌లో చెప్పారు.

త్వరలోనే పార్టీ అధిష్ఠానం కొత్త అధ్యక్షుడిని నియమిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. అయితే, జూన్ ముగిసి జూలైలోకి అడుగుపెట్టిడినా అధిష్ఠానం మాత్రం ఈ విషయంలో చడీచప్పుడు చేయడం లేదు. తనకు కేంద్ర మంత్రి భారమే సరిపోతుందన్నట్టుగా కిషన్‌రెడ్డి భావిస్తున్నా.. అధిష్ఠానం మాత్రం ఇంకా స్పందించడం లేదు.

కీలక స్థానంపై మల్లగుల్లాలు

ఎనిమిది ఎంపీ స్థానాలు సాధించి స్వింగ్‌లో ఉన్న పార్టీని నడిపించేందుకు అధ్యక్షుడిని నియమించే విషయంలో ఆ పార్టీ ఎందుకు తాత్సారం చేస్తుందో అర్థం కావడం లేదని విశ్లేషకులు అంటున్నారు. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికలు అయిపోయా యి. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే అంశంపై దృష్టి సారించాల్సి ఉంది. కిషన్ రెడ్డి కీలకమైన బొగ్గు, గనుల శాఖకు కేబినెట్ మంత్రిగా ఉన్నారు.

ఆయన రాష్ట్ర పార్టీ వ్యవహారాలు చూసే పరిస్థితి కనిపించడంలేదు. త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ తరుణంలో పార్టీ కోసం ఫుల్ టైం పనిచేసే వారిని అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. కిషన్‌రెడ్డి గత ఏడాది జూలై 4 నుంచి పార్టీ అధ్యక్ష బాధ్యతల్లో ఉన్నారు. దాదాపుగా ఏడాది పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడు ఎవరు అనేది పార్టీలోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ ఉత్కంఠను రేపుతోంది. 

అధ్యక్ష పదవి బీసీలకు?

బీజేఎల్పీ పదవిని ఓసీలకు కేటాయించినందున బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీలకు కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది. ఎంపీ లు లేదా ఎమ్మెల్యేలకు ఈ పదవిని ఇస్తారని పార్టీలోని కొందరు నాయకులు అంటున్నారు. ఎంపీల్లో అయితే ఈటల రాజేందర్, ఎమ్మెల్యేల్లో అయి తే ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌కు అవకాశం ఉందని అంటున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు సైతం అవకాశం ఉందని చెప్తు న్నారు. మరోవైపు డీకే అరుణ, రఘునందన్‌రావు సైతం పార్టీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఎవరో ఒకరితో ముందు అధ్య క్ష పదవిని భర్తీ చేసి రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలు ఊపందుకునేలా చూడాలని పార్టీ నేతలు కోరుతున్నారు.